Kim Jong Un : ప్యాలెస్‌ను కూల్చేసిన కిమ్ జోంగ్ ఉన్.. ఎందుకో తెలుసా ?
Kim Jong Un : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా సంచలనమే.
- By Pasha Published Date - 12:41 PM, Wed - 8 May 24

Kim Jong Un : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా సంచలనమే. తాజాగా ఆయన ఏకంగా తన సొంత ప్యాలెస్‌నే కూల్చి వేయించారు. కూల్చేసి.. మళ్లీ కొత్తగా కట్టడానికి అనుకుంటున్నారా ? అలాంటిదేం లేదు. కిమ్ ఏది చేసినా దేశం కోసమే చేస్తాడు. దేశ ప్రయోజనాల కోసం తన విలాసవంతమైన ‘రియోక్పో’ ప్యాలెస్‌ను కిమ్ కూల్చి వేయించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా లీకయ్యాయి. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ శివార్లలో గతంలో రియోక్పో ప్యాలెస్ ఉన్న ప్రదేశంలో.. ప్రస్తుతం ఖాళీ స్థలం ఉందని శాటిలైట్ ఫొటోలను బట్టి తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
తన ప్యాలెస్ స్థలాన్ని ఉత్తర కొరియా ఆర్మీకి కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) అప్పగించాడని అంటున్నారు. బహుశా ఏప్రిల్ 21 నుంచి 25 తేదీల మధ్య ప్యాలెస్‌ను కూల్చివేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కిమ్ ప్యాలెస్‌ను కూల్చివేసిన ప్రదేశంలో కీలకమైన మిస్సైళ్లు, ఇతరత్రా ఆయుధాల తయారీ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఆయుధాల తయారీకి ఉపయోగించకుంటే.. సైనిక స్థావరం ఏర్పాటుకు ప్యాలెస్ స్థలాన్ని వినియోగించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read :Gujjula Premendar Reddy : ఎమ్మెల్సీ బైపోల్.. బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
దేశ సైన్యాన్ని ఆధునికీకరించే పనిలో కిమ్ బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో పలు శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది. అమెరికా, దక్షిణ కొరియా వార్నింగ్‌లకు భయపడకుండా.. నిఘా ఉప గ్రహాన్ని కూడా సక్సెస్ ఫుల్‌గా ఉత్తర కొరియా ప్రయోగించింది. రహస్యంగా అణ్వాయుధ తయారీపైనా ఉత్తర కొరియా పనిచేస్తోందనే వార్తలు వినవస్తున్నాయి. ఈక్రమంలో ఉత్తర కొరియాకు అవసరమైన రిఫైన్డ్ చమురును రష్యా రహస్యంగా సప్లై చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఉత్తర కొరియాకు సంవత్సరానికి 5 లక్షల బ్యారెళ్లకు మించి రిఫైన్డ్ చమురును సప్లై చేయకూడదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది. అయితే దీన్ని పక్కనపెట్టి ఉత్తర కొరియాకు రష్యా చమురును సప్లై చేస్తోందని అంటున్నారు.