Forest Area Lost : ప్రపంచ వ్యాప్తంగా ఒక్క నిమిషానికి ఎంత శాతం అడవిని కోల్పోతున్నామో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా అడవుల సంరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రతీయేటా అడవుల విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (WRI) ప్రకారం..
- By News Desk Published Date - 09:07 PM, Tue - 27 June 23

ప్రపంచ వ్యాప్తంగా అడవుల సంరక్షణకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రతీయేటా అడవుల విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (WRI) ప్రకారం.. 2022 సంవత్సరంలో ప్రతి నిమిషానికి 11 ఫుట్‌బాల్ మైదానాల (Football fields) పరిమాణంలో అడవుల విధ్వంసం (Destruction forests) జరిగింది. ఎక్కువగా బ్రెజిల్ దేశంలో అడవుల విస్తీర్ణం క్షీణించిపోయిందని సర్వేలో తేలింది. మొత్తం 2022లో 4.1 మిలియన్ హెక్టార్లలో ప్రాథమిక అడవులు నేలమట్టం అయ్యాయి. 2021 సంవత్సరంతో పోలిస్తే 2022 సంవత్సరంలో పదిశాతం అదనంగా అటవీ విస్తీర్ణం క్షీణించిపోయినట్లు తేలింది. 2022లో అటవీ విస్తీర్ణం కోల్పోవడం గత నాలుగేళ్లతో పోలిస్తే తీవ్ర పెరుగుదలగా ఉంది.
బ్రెజిల్, బొలీవియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అటవీ నష్టం ఎక్కువగా జరుగుతోందట. ఇదే సమయంలో ఇండోనేషియా, మలేసియా దేశాల్లో ఇటీవలి కాలంలో చెట్ల నష్టం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం, కలప, మైనింగ్ వంటి ప్రధాన కారణాల వల్ల అటవీ విస్తీర్ణం తగ్గుతోందని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా లేదా సహజంగా సంభవించే మంటలు కూడా అటవీ నష్టానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల 2022లో 2.7 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పెరుగుదలకు దారితీసిందని, ఇది భారతదేశంలోని శిలాజ ఇంధన ఉద్గారాలకు సమానమని ఆన్‌లైన్ డేటా ప్లాట్‌ఫారమ్ అయిన గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ డైరెక్టర్ మైకేలా వీస్ చెప్పారు.
2021లో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి COP26 వాతావరణ చర్చలో సింగపూర్‌తో సహా 140 కంటే ఎక్కువ దేశాలు 2030 నాటికి అటవీ నష్టం, భూమి క్షీణతను ఆపడానికి అడవులను పెంచే దిశగా గ్లాస్గో లీడర్స్ డిక్లరేషన్‌పై సంతకం చేశాయి. 2021లో గ్లాస్గోలో చేసిన వాగ్దానాలు రాబోయే సంవత్సరాల్లో మరింత మెరుగ్గా ఉండగలవని కొత్త ఆశ ఉంది. అయితే, అన్ని దేశాలు అడవుల సంరక్షణకు చర్యలు చేపడితేనే ఇది సాధ్యమవుతుంది. అడవుల నరకివేతపై కఠినంగా ఉండటం, మంటలు, ఇతర కారణాల ద్వారా అడవుల నష్టపోకుండా చూడటం వంటి చర్యలు చేపడితే రాబోయే కాలంలో గ్లాస్గోలో చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోవచ్చునని పలు సంస్థలు పేర్కొంటున్నాయి.
ORR Speed Limit: దూసుకెళ్లొచ్చు..! హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై గరిష్ట వేగం పరిమితి పెంపు