71 విమానాలతో చైనా దూకుడు..భయంతో తైవాన్ ప్రజలు
చైనా తన దూకుడును పెంచుతోంది. ప్రపంచ దేశాల్లో చైనా తన బలం ఏంటో నిరూపించుకునేందుకు ప్రతిసారీ ఏదోకటి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
- By Anshu Published Date - 09:44 PM, Mon - 26 December 22

చైనా తన దూకుడును పెంచుతోంది. ప్రపంచ దేశాల్లో చైనా తన బలం ఏంటో నిరూపించుకునేందుకు ప్రతిసారీ ఏదోకటి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తైవాన్ పై చైనా తన బల ప్రదర్శనను కొనసాగిస్తోంది. గత 24 గంటల్లో సుమారు 71 విమానాలతో చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది.
అదేవిధంగా ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించి తన విన్యాసాలను చూపించింది. చైనా తన దూకుడును అలా వ్యవహరిస్తోందని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ మీడియా ముఖంగా వెల్లడించింది. అమెరికా రక్షణ బిల్లులో తైవాన్‌కు కొన్ని కేటాయింపులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటువంటి కేటాయింపులు జరిపిన సమయంలో కూడా తైవాన్ దేశంపై చైనా ఆగ్రహంగా ఉండటంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది.
గత కొన్ని రోజులుగా తైవాన్ దేశంపై చైనా సైనిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తైవాన్ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. తైవాన్ తమ భూభాగమే అని చైనా చాలా రోజుల నుంచి వాదిస్తూ వస్తోంది. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి సైతం కల్పించుకోవాల్సి ఉంది. అయితే ఎవరికీ తలవంచని చైనా తన దూకుడును ప్రదర్శిస్తోంది.
తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లుగా తైవాన్ రక్షణశాఖ వెల్లడించారు. జే-16 ఫైటర్ జెట్స్ 18, జే-1 ఫైటర్ విమానాలు 11, ఆరు సుఖోయ్-30 ఫైటర్ విమానాలతో పాటు డ్రోన్లను కూడా తైవాన్ దేశంపైకి చైనా పంపుతోందని, ఇది చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా పాల్పడుతున్న చర్యలకు తైవాన్ దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఎప్పుడు తమకు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది.