Viral : కల్లు కోసం రోడ్డెక్కిన గ్రామస్థులు
Viral : కల్లు తాగకపోవడం వల్ల పని చేసే సమయంలో కాళ్లు చేతులు వణుకుతున్నాయని, వృద్ధులు స్పృహ కోల్పోయి పడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు
- Author : Sudheer
Date : 20-04-2025 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలానికి చెందిన మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు వినూత్నంగా ఆందోళనకు దిగారు. “మాకు కల్లు కావాలి” అంటూ నినాదాలు చేస్తూ, గ్రామంలో కల్లు సరఫరా నిలిచిపోయినందుకు నిరసన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా గ్రామానికి కల్లు సరఫరా లేకపోవడంతో వృద్ధులు, శారీరకంగా శ్రమించే వారు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.
CBN Birthday : అనితర సాధ్యుడు మన బాబు
గ్రామస్థులు చెబుతున్న వివరాల ప్రకారం.. కల్లు తాగకపోవడం వల్ల పని చేసే సమయంలో కాళ్లు చేతులు వణుకుతున్నాయని, వృద్ధులు స్పృహ కోల్పోయి పడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “బండ్లు ఉన్నవాళ్లు బీర్కూర్ వరకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. కానీ వృద్ధులు ఎలా తీసుకురాగలరు?” అని ప్రశ్నించారు. ఈ సమస్యను సంబంధిత అధికారులు గమనించి తక్షణమే స్పందించాలని, గ్రామానికి తిరిగి కల్లు సరఫరా పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రభుత్వ సౌకర్యాలు, రోడ్లు, నీరు వంటి అంశాలపై ప్రజలు ఆందోళనలు చేస్తుంటే, ఈసారి కల్లు కోసం గ్రామస్థులు రోడ్డెక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది ఆ గ్రామంలోని జీవనశైలి, సంప్రదాయాలతో ముడిపడిన విషయం అని స్థానికులు చెబుతున్నారు.