Playing Cards – World Record : ప్లేయింగ్ కార్డ్స్ తో 4 భవనాలు.. 15 ఏళ్ల కుర్రాడి వరల్డ్ రికార్డు
Playing Cards - World Record : ‘‘కాదేదీ గిన్నిస్ రికార్డుకు అనర్హం’’ అని కోల్ కతాకు చెందిన 15 ఏళ్ల అర్నవ్ నిరూపించాడు.
- By Pasha Published Date - 01:15 PM, Sat - 7 October 23

Playing Cards – World Record : ‘‘కాదేదీ గిన్నిస్ రికార్డుకు అనర్హం’’ అని కోల్ కతాకు చెందిన 15 ఏళ్ల అర్నవ్ నిరూపించాడు. 41 రోజుల పాటు శ్రమించి.. ప్లేయింగ్ కార్డ్స్ తో కోల్ కతాలోని 4 రకాల భారీ భవన నిర్మాణాల నమూనాలను తయారు చేశాడు. రాయిటర్స్ బిల్డింగ్, షహీద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, సెయింట్ పాల్స్ కేథడ్రల్ భవనాల ప్రతి రూపాలను నిర్మించడానికి అర్నవ్ 1.43 లక్షల కార్డులను ఉపయోగించాడు. దీంతో వరల్డ్ రికార్డు అతడి సొంతమైంది. అర్నవ్ రూపొందించి భవనాలు 11 అడుగుల పొడవు, 4 అంగుళాల ఎత్తు, 16 అడుగులు, 8 అంగుళాల వెడల్పుతో ఉన్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ తో ఇంతపెద్ద స్ట్రక్చర్ ను రూపొందించడంతో గిన్నిస్ ప్రపంచ రికార్డు అర్నవ్ సొంతమైంది. గతంలో బైగాన్ బెర్గ్ అనే వ్యక్తి క్రియేట్ చేసిన రికార్డును మన అర్నవ్ బద్దలు కొట్టాడు.
We’re now on WhatsApp. Click to Join
అర్నవ్ కు ఈ రికార్డు ఈజీగా దక్కలేదు. అతడు ఎనిమిదేళ్ల వయసులోనే ప్లేయింగ్ కార్డ్స్‌తో చిన్నచిన్న మేడలు కట్టడం మొదలుపెట్టాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో దీనిపై గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు తనను చూసి తల్లిదండ్రులు గర్వంగా ఫీల్ అవుతున్నారని అర్నవ్ అంటున్నాడు. తనకు ప్రాక్టీస్ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని.. అయినా నిరాశ పడకుండా మళ్లీ మళ్లీ అభ్యాసాన్ని కొనసాగించానని చెప్పాడు. అతడు ప్లేయింగ్ కార్డ్స్ తో భవనాలు నిర్మించే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడిపై నెటిజన్స్ ప్రశంసల జల్లు (Playing Cards – World Record) కురిపిస్తున్నారు.