Yesudas : ఏసుదాస్ కు గురువాయూర్ ఆలయంలో ప్రవేశం లేదా?
భారతదేశం గర్వించదగ్గ గాయకుడు, కేరళకు చెందిన ఏసుదాస్ కు ఆ రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో ప్రవేశం లేదా.
- By Hashtag U Published Date - 05:27 PM, Wed - 5 January 22

భారతదేశం గర్వించదగ్గ గాయకుడు, కేరళకు చెందిన ఏసుదాస్ కు ఆ రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో ప్రవేశం లేదా. గురువాయూర్ లోని శ్రీకృష్ణ ఆలయంలోనికి ఏసుదాస్ ను అనుమతించాలని శివగిరి శ్రీ నారాయణ ట్రస్ట్ అధ్యక్షులు స్వామి సచ్చిదానంద ఇటీవల చేసిన విజ్ఞప్తి రాష్ట్రంలో మరోసారి చర్చకు దారి తీసింది. రోమన్ క్యాథలిక్ మతానికి చెందిన ఏసుదాస్ సినీ నేపథ్య గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి ఆరు దశాబ్దాలు పూర్తయింది. ఏసుదాస్ క్రిస్టియన్ కావడంతో కేరళలోని అనేక ప్రసిద్ధ హిందూ ఆలయాల్లో ఆయనకు ప్రవేశం లేదు. నారాయణ ట్రస్ట్ అధ్యక్షుడి విన్నపంతో రాష్ట్రంలో దీనిపై మళ్ళీ చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఏసుదాస్ ఆలయంలో ప్రవేశించేందుకు అనుమతించడానికి శ్రీకృష్ణ ఆలయం పాలకమండలి ఛైర్మన్ కేబీ మోహన్ దాస్ సానుకూలంగానే ఉన్నారు. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఆలయ ప్రధాన పూజారి మాత్రమే. ఆయన మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. కేరళలోని అనేక ఆలయాల్లో ఏసుదాస్ పాటలతోనే దేవతలను మేల్కొల్పుతారు. కాని గురువాయూర్ ఆలయంలోనికి మాత్రం ఆ గాయకుడిని అనుమతించకపోవడం విచారకరమనే వాదనలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ అన్యాయాన్ని ఇప్పటికైనా సరిదిద్ది, తన ఇష్టదైవాన్ని కొలుచుకునే అవకాశం ఏసుదాస్ కు ఇవ్వాల్సి ఉందని కామెంట్ చేశారు స్వామి సచ్చిదానంద.
Also Read : బ్రిటిషర్లను ఎదురించి పోరాడిన టిప్పు సుల్తాన్ ఆస్థాన నర్తకి
అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఏసుదాస్ ఈ వివాదంపై స్పందించడానికి అందుబాటులో లేరు. కేరళకు చెందిన అనేక మంది రచయితలు, కవులు, మేధావులు, మత సంస్థలు ఏసుదాస్ కు సంబంధించి శివగిరి మఠం అధిపతి చేసిన సూచనను స్వాగతిస్తున్నారు. ఏసుదాస్ ఆలయ ప్రవేశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని గురువాయూర్ ఆలయం ప్రధాని పూజారి దినేశన్ నంబూద్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైనా భక్తుడు తన ఇష్ట దైవాన్ని కొలుచుకోవాలని అనుకుంటే దేవుడికి, భక్తుడికి మధ్యలో ఎలాంటి అడ్డంకులు ఉండరాదన్నారు ప్రముఖ మలయాళ రచయి పద్మనాభన్. విశ్వహిందూపరిషత్, భారతీయ విచార కేంద్ర, కేరళ బ్రాహ్మణసభ వంటి అనేక హిందూ మత సంస్థలు, సంఘాలు ఏసుదాస్ విషయంలో సానుకూలంగా ఉన్నాయి.
Also Read : 200 ఏళ్లుగా మృదంగాలే వారికి జీవనాధారం
శబరిమల అయ్యప్ప, కొల్లూరు మూకాంబిక ఆలయాలకు ఏసుదాస్ క్రమం తప్పకుండా వెళుతుంటారు. ఏసుదాస్ తన కేరీర్ లో బ్రహ్మాండమైన ప్రజాదరణ పొందిన హిందూ దేవతల భక్తిగీతాలు పెద్ద సంఖ్యలో ఆలపించారు. ఏసుదాస్ చిన్నతనంలో అంటే 1950వ సంవత్సరంలో తన గురువు వైద్యనాథ భాగవతార్ తో గురువాయూర్ ఆలయానికి వెళ్ళగా అప్పటి పూజారులు లోనికి రానీయలేదు. ఏసుదాస్ క్రిష్టియన్ అనే నెపంతో అడ్డుకున్నారు. ఆలయంలోకి ఎలాంటి అనుమతి లేకుండా క్రిమి, కీటకాలు కూడా ప్రవేశిస్తున్నాయి. కాని తనకు మాత్రం ప్రవేశం లేకపోవడం బాధాకరమని ఒకసారి ఏసుదాస్ కామెంట్ చేశారు. 2017లో తిరువనంతపురంలోని పద్మనాభ ఆలయంలో కచేరి నిర్వహించడానికి ఏసుదాస్ ను అనుమతించారు.