US Science Advisor: అమెరికా అధ్యక్షుడి సైన్స్ అడ్వైజర్ గా ఆరతి ప్రభాకర్.. ప్రవాస భారతీయ వనిత వివరాలివీ!!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలక వర్గంలో త్వరలోనే ఓ ప్రవాస భారతీయ వనితకు కీలక పదవి దక్కబోతోంది.
- By Hashtag U Published Date - 12:32 AM, Thu - 16 June 22
 
                        అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలక వర్గంలో త్వరలోనే ఓ ప్రవాస భారతీయ వనితకు కీలక పదవి దక్కబోతోంది. అమెరికా అధ్యక్షుడికి శాస్త్ర, సాంకేతిక అంశాలపై సలహాలిచ్చే కీలకమైన “సైంటిఫిక్ అడ్వైజర్” పోస్టును 63 ఏళ్ల ఆరతి ప్రభాకర్ చేపట్టనున్నారు. ఈ పోస్టుకు ఆమెను నామినేట్ చేస్తూ ఈ వారాంతంలోగా జో బైడెన్ కార్యాలయం ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నియామక ప్రక్రియకు అమెరికా సెనేట్ నుంచి లాంఛనప్రాయమైన ఆమోదం లభించడానికి ఇంకొన్ని నెలల సమయం పట్టనుంది.
ఇండియాలో పుట్టి.. అమెరికాలో పెరిగి..
ఆరతి ప్రభాకర్ 1959వ సంవత్సరం ఫిబ్రవరి 2న న్యూఢిల్లీలో జన్మించారు. అయితే ఆమె విద్యాభ్యాసం అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. 1984లో కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహెచ్డీ పట్టా పొందారు. అనంతరం అమెరికా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో చేరారు. ఆ తర్వాత బిల్ క్లింటన్ హయాంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ ఐ ఎస్ టీ) కు హెడ్ గా నియమితులయ్యారు. పదవీ విరమణ పొందే వరకు(1993 – 1997) అక్కడ సేవలు అందించారు. రిటైరయ్యాక సిలికాన్ వ్యాలీకి వచ్చి, రెండు దశాబ్దాల పాటు వెంచర్ క్యాపిటలిస్టుగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బరాక్ ఒబామా హయాంలో ఆరతి ప్రభాకర్ ను కీలక పదవి వరించింది. రక్షణ రంగంతో ముడిపడిన డిఫెన్స్ అడ్వాన్స్ డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (దర్ప) విభాగం అధిపతి పదవిని నాడు ఆరతి ప్రభాకర్ నిర్వహించారు. 2012 జూలై 30 నుంచి 2017 జనవరి 20 వరకు ఆ పదవిలో ఆమె కొనసాగారు.