RBI New Notes: మార్కెట్లోకి రూ. 10, రూ. 500 కొత్త నోట్లు.. ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో 10, 500 రూపాయల కొత్త నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌లో భాగంగా ఉంటాయని, వీటిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని RBI తెలిపింది.
- By Gopichand Published Date - 09:14 AM, Sat - 5 April 25

RBI New Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI New Notes) త్వరలో 10, 500 రూపాయల కొత్త నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్‌లో భాగంగా ఉంటాయని, వీటిపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుందని RBI తెలిపింది. ఇంతకుముందు 100, 200 రూపాయల కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
RBI ఏమి చెప్పింది?
తాజా అప్‌డేట్‌లో కేంద్ర బ్యాంక్ ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని 10, 500 రూపాయల నోట్ల మాదిరిగానే ఉంటుందని పేర్కొంది. గతంలో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన 10, 500 రూపాయల నోట్లన్నీ చట్టబద్ధమైన చెల్లుబాటు (లీగల్ టెండర్)గా కొనసాగుతాయి. కొత్త నోట్లపై RBI గవర్నర్ మల్హోత్రా సంతకం ఉంటుంది.
నోట్లు ఎప్పుడు విడుదలవుతాయి?
RBI కొన్ని సందర్భాల్లో కొత్త నోట్లను జారీ చేస్తుంది. ఉదాహరణకు మార్కెట్‌లో ఉన్న కరెన్సీ నోట్లు చాలా పాతవి అయినప్పుడు, నోట్ల డిజైన్‌లో మార్పులు చేసినప్పుడు లేదా కొన్ని నోట్లను చలామణి నుండి తొలగించినప్పుడు విడదలవుతాయి. 2016లో నోట్ల రద్దు సమయంలో ఇలాంటిది చూశాం. 10, 500 రూపాయల కొత్త నోట్లు వచ్చినా మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న పాత నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని, అవి చెల్లుబాటులోనే ఉంటాయని, వాటిని రద్దు చేయబోమని RBI స్పష్టం చేసింది.
Also Read: Tilak Varma: ముంబై ఓటమికి తిలక్ వర్మనే కారణమా?
100, 200 నోట్ల గురించి కూడా?
గత నెలలో RBI త్వరలో 100, 200 రూపాయల కొత్త నోట్లను విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో పాత నోట్ల గురించి ఏమవుతుందనే చర్చ మొదలైంది. అప్పుడు కేంద్ర బ్యాంక్ ఈ నోట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పు ఉండదని, కేవలం RBI గవర్నర్ సంతకంలో మాత్రమే మార్పు ఉంటుందని తెలిపింది. సంజయ్ మల్హోత్రా RBI గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించార. కాబట్టి, ఆయన సంతకంతో 100, 200 రూపాయల కొత్త నోట్లు విడుదలవుతాయి. ఇది ఒక సాధారణ ప్రక్రియ. కొత్త గవర్నర్ నియామకం తర్వాత ఆయన సంతకంతో నోట్లు జారీ అవుతాయి. ఇంతకుముందు ఉన్న నోట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు.
2016లో నోట్ల రద్దు
నవంబర్ 2016లో నోట్ల రద్దు జరిగింది. దీని కింద 500, 1000 రూపాయల నోట్లను చలామణి నుండి తొలగించారు. తర్వాత ప్రభుత్వం 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. ఈ నోటు కోసం ATM యంత్రాల్లో మార్పులు చేశారు. అయితే మే 2023లో RBI 2000 రూపాయల నోటును కూడా రద్దు చేసే నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోటును రద్దు చేసే సమయంలో చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్ల విలువ సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది.