IRCTC Down: మరోసారి ఐఆర్‌సీటీసీ సేవలో అంతరాయం..వినియోగదారుల ఆగ్రహం
రైల్వే టికెట్ బుకింగ్స్ వెబ్ సైట్, యాప్ IRCTC పనిచేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రైల్వేను, IRCTC నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
- By Latha Suma Published Date - 01:15 PM, Tue - 31 December 24

IRCTC Down : ఇండియన్ రైల్వే బుకింగ్స్ వెబ్ సైట్, యాప్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) రైల్వే టికెట్ బుకింగ్స్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అయితే ఈ డిసెంబర్ 2024 లో ఇప్పటికే రెండుసార్లు ఐఆర్‌సీటీసీ సేవలు నిలిచిపోయాయి. తాజాగా ఇవాళ (డిసెంబర్ 31) ఉదయం మరోసారి ఇదే జరిగింది. దీంతో చాలా మంది వినియోగదారులు X (గతంలో ట్విటర్‌గా ఉండేవారు) తమ చిరాకులను వెళ్లగక్కారు. పదేపదే సేవా అంతరాయాల వల్ల కలిగే అసౌకర్యం గురించి మీమ్‌లు మరియు పోస్ట్‌లను పంచుకున్నారు.
ఇవాళ రైల్వే తత్కాల్ బుకింగ్స్ ఓపెనింగ్ కు సరిగ్గా పదినిమిషాల ముందు IRCTC వెబ్ సైట్, యాప్ పనిచేయడం ఆగిపోయింది. ఉదయం 9.50 గంటలకు ఈ అంతరాయం ఏర్నడింది. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినవారికి ”బుకింగ్ ఆండ్ క్యాన్సలేషన్ వంటి సేవలు మరో గంటసేపటి వరకు అందుబాటులో వుండవు. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. అయితే టికెట్ క్యాన్సలేషన్, టిడిఆర్ ఫైల్ చేయడానికి కస్టమర్ కేర్ నంబర్ 14646,08044647999 లేదా 08035734999కు కాల్ చేయండి.లేదా etickets@irctc.in కు మెయిల్ చేయండి” అని సూచిస్తోంది.
మరోవైపు న్యూ ఇయర్ నేపథ్యంలో రేపు (బుధవారం) తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో సెలవు వుంది. దీంతో న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన ప్రజలు ప్రయాణాలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో రైల్వే టికెట్ బుకింగ్స్ వెబ్ సైట్, యాప్ IRCTC పనిచేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రైల్వేను, IRCTC నిర్వహణపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
డౌన్ డిటెక్టర్ ప్రకారం… ఐఆర్ సిటిసి వెబ్ సైట్ ను దాదాపు 47 శాతం ఉపయోగించలేకపోతున్నారు. ఇక 42 శాతం వినియోగదారులు యాప్ లో సమస్య ఎదుర్కొంటున్నారు. 10 శాతం మంది టికెట్ బుకింగ్ పూర్తి చేయలేకపోతున్నారు. ఇలా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, యాప్ పనితీరు అత్యంత దారుణంగా వుందని తెలుస్తోంది. ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ యాప్, వెబ్ సైట్ IRCTC సేవలకు పదేపదే అంతరాయం కలగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఒకటిరెండు సార్లు కాదు ప్రతిసారీ టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నించే వినియోగదారులకు సమస్యే ఎదురవుతోంది. కేవలం ఈ ఒక్క నెలలోనే (డిసెంబర్ 2024) ఇలా ఐఆర్ సిటిసి పనిచేయకపోవడం ఇది మూడోసారి. దీన్నిబట్టే దీని పనితీరు ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.