Synthetic Embryo: ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ పిండం.. వీర్యంతో పని లేకుండా అభివృద్ధి!!
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కొత్త చరిత్రను లిఖించారు.
- By Hashtag U Published Date - 07:45 AM, Fri - 5 August 22

ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కొత్త చరిత్రను లిఖించారు.
ప్రపంచంలోనే తొలిసారిగా ఒక సింథటిక్ పిండాన్ని అభివృద్ధి చేశారు. అది కూడా పురుష వీర్య కణాలతో పని లేకుండానే!!
ఈ ప్రయోగంలో భాగంగా ఎలుకల నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ ను ల్యాబ్ లో ఒక కంటైనర్ లో భద్రపరిచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని ఆ కంటైనర్ లో సృష్టించారు. అందులో ఉన్న పోషక జలం ప్రభావం వల్ల స్టెమ్ సెల్స్.. వీర్య కణాలతో పని లేకుండానే ఫలదీకరణం చెందాయి. కంటైనర్ లో ఉన్న స్టెమ్ సెల్స్ కు అవసరమైన పోషకాలు, రక్తాన్ని అందేలా శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఎలుకల్లో అండం ఫలదీకరణం జరగడానికి 20 రోజుల సమయం పడుతుంది. కానీ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ల్యాబ్ లో కేవలం 8 రోజుల్లో వీర్య కణంతో సంబంధం లేకుండా అండాన్ని ఫలదీకరణం చేయించారు.
సాధారణ ఎలుక పిండంతో పోలిస్తే.. ఇజ్రాయెల్ సైంటిస్టులు అభివృద్ధి చేసిన కృత్రిమ ఎలుక పిండం స్వరూప స్వభావాలు దాదాపు 95 శాతం ఒకేలా ఉన్నాయి. అంతర్గత నిర్మాణం, జీన్ ఎక్స్ ప్రెషన్ కూడా రెండింటిలో ఒకే విధంగా ఉన్నట్టు వెల్లడైంది. కృత్రిమ పిండం ఫలదీకరణం చెందిన తర్వాత అందులోనూ శరీర భాగాలు సక్రమంగా,సంపూర్ణంగానే ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఎలుక కృత్రిమ పిండాన్ని సూక్ష్మ స్థాయిలో విశ్లేషించగా.. మెదడు, గుండె, న్యూరల్ ట్యూబ్, తోక వంటి భాగలన్నీ ఏర్పడినట్లు చెప్పారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక “జర్మల్ సెల్”లో ప్రచురితం అయింది.
స్త్రీ శరీరంలోని అతి పెద్ద కణాలు ‘అండాలు’.. పురుష శరీరంలో అతి చిన్న కణాలు వీర్య కణాలు. వీర్య కణం కంటే అండం సుమారు 30 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్లనే మనిషి పుట్టుక మొదలవుతుంది.
సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషుడి నుంచి విడుదలయ్యే వీర్యంలో 5 కోట్ల నుంచి 15 కోట్ల వీర్యకణాలు ఉంటాయి.
అవన్నీ స్త్రీ ఫాలోపియన్ నాళం వైపు ప్రయాణం ప్రారంభిస్తాయి. కానీ, అందులో కేవలం ఓ పది కణాలు చివరి దాకా వెళ్లగలుగుతాయి.
ఆఖరికి అండంతో ఫలదీకరణ చెందేది మాత్రం ఒక్క కణమే.