Amit Shah : త్వరలోనే ఉబర్, ఓలాలకు పోటీగా ప్రభుత్వ ‘సహకార్ టాక్సీ’ : అమిత్ షా
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారంగా 'సహకార్ ట్యాక్సీ' పేరుతో ప్రత్యేక ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
- Author : Latha Suma
Date : 27-03-2025 - 12:23 IST
Published By : Hashtagu Telugu Desk
Amit Shah : ఉబర్, ఓలా వంటి క్యాబ్ సేవలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక, డిమాండ్‌ను బట్టి ఆయా క్యాబ్ సర్వీసెస్ కంపెనీలు ఛార్జీలను వసూలు చేస్తుంటాయి. అయితే, ఆ మొత్తాన్ని పూర్తిగా డ్రైవర్లకు అందజేయడం లేదు. వినియోగదారుల నుంచి వసూలు చేసిన చార్జీల్లో భారీ కోత విధించి మిగిలిన మొత్తం మాత్రమే డ్రైవర్లకు చెల్లిస్తున్నారు. దీంతో ఈ వ్యవస్థపై డ్రైవర్లు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారంగా ‘సహకార్ ట్యాక్సీ’ పేరుతో ప్రత్యేక ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
Read Also: Indian Auto Companies : ట్రంప్ 25 శాతం ఆటోమొబైల్ పన్ను.. ఏయే భారత కంపెనీలపై ఎఫెక్ట్ ?
ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించారు. డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా ఈ ట్యాక్సీ సేవలను రూపొందించినట్టు మంత్రి తెలిపారు. ఉబర్, ఓలా లాంటి యాప్ ఆధారిత సేవల తరహాలోనే సహకార్ ట్యాక్సీ సేవలుంటాయి. మధ్యవర్తుల బెడద లేకుండా డ్రైవర్లు టూ-వీలర్, ట్యాక్సీలు, రిక్షాలు, కార్లను రిజిస్టర్ చేసుకునేలా వీలు కల్పిస్తుంది. మరికొన్ని నెలల్లో డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలు అందించే విధంగా ప్రధాన సహకార ట్యాక్సీ సేవలు ప్రారంభిస్తామని హోం మంత్రి తెలిపారు. ఈ చొరవ ‘సహకార్ సే సమృద్ధి(సహకారంతో శ్రేయస్సు) అనే ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా తీసుకున్నదని చెప్పారు. ఇది కేవలం నినాదం కాదు. సహకార మంత్రిత్వ శాఖ మూడున్నరేళ్లుగా అవిశ్రాంతంగా దీనిని అమలు చేయడానికి కృషి చేసింది. మరికొన్ని నెలల్లో డ్రైవర్లకు ప్రత్యక్ష లాభాలను అందించే ప్రధాన సహకార టాక్సీ సర్వీసులు ప్రారంభమవుతాయని వివరించారు.
ఇటీవల ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారుల మధ్య చార్జీల వ్యత్యాసంపై వచ్చిన నివేదికల నేపథ్యంలో, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఓలా, ఉబర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఓలా ఈ ఆరోపణలను స్పందింస్తూ..”మా ప్లాట్‌ఫామ్‌లో ఫోన్ మోడల్ ఆధారంగా ధరలు నిర్ణయించము, అందరికీ సమానమైన చార్జీలు ఉంటాయి అని స్పష్టీకరించింది. ఉబర్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టడం వల్ల, ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సేవల ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Also: Bangladesh : మహమ్మద్ యూనస్‌కు ప్రధాని మోడీ లేఖ