India-China : త్వరలో భారత్ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
.భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్చలు జరిపాం. ఈ అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మిస్రీ ప్రత్యేకంగా అభినందించారు.
- By Latha Suma Published Date - 12:33 PM, Fri - 13 June 25

India-China : కోవిడ్-19 మరియు గల్వాన్ లోయ ఘటనల నేపథ్యంలో భారత్-చైనా మధ్య గతంలో నిలిచిపోయిన నేరుగా విమాన సర్వీసులపై ఇప్పుడు పునఃప్రారంభానికి మార్గం సుగమమవుతోంది. ఐదేళ్ల గ్యాప్ తర్వాత, ఈ రెండు ఆసియాన్ శక్తులు మళ్లీ నేరుగా విమాన సేవలు ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్ వీడాంగ్‌తో మిస్రీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్చలు జరిపాం. ఈ అంశంపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మిస్రీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను పునర్నిర్మించేందుకు ఇరుదేశాలు చర్చలు జరిపాయి. ముఖ్యంగా వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పరిస్థితులను సమీక్షించినట్లు మిస్రీ తెలిపారు. చర్చలు నిర్మాణాత్మకంగా, సానుకూల వాతావరణంలో సాగాయని తెలిపారు. నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయడానికి ఇరుపక్షాలూ అంగీకరించాయి. వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, మీడియా మరియు పరిశోధనా సంస్థల మధ్య సమాచార మార్పిడి ప్రోత్సాహించడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి. వాణిజ్య, ఆర్థిక రంగాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని మిస్రీ స్పష్టం చేశారు.
గతంలో, 2020లో కొవిడ్ మహమ్మారి ప్రారంభమవడంతో పాటు గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అయితే, గత కొద్ది నెలలుగా లద్దాఖ్ సరిహద్దులో సైనిక ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం వంటి విషయంలో కొన్ని పరస్పర ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాల్లో విమాన సర్వీసుల పునఃప్రారంభం ఒక ముఖ్యాంశంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఈ సంవత్సరం జనవరిలో విక్రమ్ మిస్రీ చైనాను సందర్శించారు. ఆ సమయంలోనూ విమాన సర్వీసుల పునఃప్రారంభంపై చర్చలు జరిగాయి. అప్పట్లోనే ఇరుదేశాలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయని వెల్లడించారు. మొత్తంగా చూస్తే, భారత్-చైనా సంబంధాల్లో మళ్లీ హేతుబద్ధత, సహకారం ప్రారంభమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడం వల్ల రెండు దేశాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. వ్యాపార, విద్య, పర్యాటక రంగాల్లో కూడ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.