Delhi : ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఘటన..రేపు సుప్రీంకోర్టులో విచారణ..!
Delhi : ముగ్గురు యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నవీన్ డాల్విన్, యూపీకి చెందిన శ్రేయా యాదవ్ ఉన్నారు. ఈ ఘటనపై ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే.
- By Latha Suma Published Date - 04:31 PM, Sun - 20 October 24

Supreme Court : ఢిల్లీలోని ఓ ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ముగ్గురు విద్యార్థుల మృతికి సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనున్నది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సోమవారం విచారణ జరుపనున్నట్లు కోర్టు వెబ్‌సైట్ పేర్కొంది. సెప్టెంబర్ 20న కోచింగ్ సెంటర్ తరహా ఘటనలను నిరోధించేందుకు తీసుకున్న మధ్యంతర చర్యలను వివరించాలని.. మరణాలకు కారణాలపై దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో జూలై 27న సంభవించిన వరదల కారణంగా రావూస్ అకాడమీ బేస్‌మెంట్‌లో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
ముగ్గురు యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నవీన్ డాల్విన్, యూపీకి చెందిన శ్రేయా యాదవ్ ఉన్నారు. ఈ ఘటనపై ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారాయని.. ఈ ఘటన అందరి కళ్లు తెరిపించేలా ఉందని వ్యాఖ్యానించింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లు భద్రతా ప్రమాణాలు, గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలకు పూర్తి అనుగుణంగా ఉండే వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆదేశించింది. వాస్తవానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆటలాడుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వానికి సీఎస్ నివేదికను సమర్పించారు.
రాజేంద్ర నగర్‌లోని రావూస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా బ్లాక్ చేసిందని.. ఇన్‌స్టిట్యూట్‌లో రెస్క్యూ సిస్టమ్ లేదని పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్ నడుస్తున్న భవనం పార్కింగ్ ఎత్తు చుట్టుపక్కల ఆస్తుల కంటే తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. భారీ వరద రాకుండా పార్కింగ్ ప్రాంతం, గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వర్షపు నీరు చేరకుండా ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారన్నారు. వరదలతో నీరు ప్రహరీ గోడలను దాటి గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వచ్చిందని.. ఇందులో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ఎండీసీ నివేదిక పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరిగింది. విద్యార్థుల మృతిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని బెంచ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.