KTR : రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల కష్టాలు కనిపించట్లేదా..? కేటీఆర్ సూటి ప్రశ్న
KTR : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ఏడాది కావచ్చినా ఒక్క సరైన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు
- By Sudheer Published Date - 03:14 PM, Fri - 4 July 25

తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, ఏడాది కావచ్చినా ఒక్క సరైన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఛలో సచివాలయం కార్యక్రమానికి వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. నిరుద్యోగుల పక్షాన రేవంత్ స్పందించాల్సిన సమయంలో వారిని అణచివేత విధించడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు.
Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటికి షాక్
ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ ఓపెన్ ఉంటాయని ప్రచారం చేసిన రేవంత్‌కు ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. గతంలో చాయ్ పే చర్చ అంటూ రాహుల్ గాంధీని పిలిపించి నిరుద్యోగులతో ముఖాముఖీ మాట్లాడిన ముఖ్యమంత్రి, ఇప్పుడు వారిని అరెస్టు చేయడం ఎంతటి వెనుకబడిన చర్య అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన 60,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తమదిగా చెప్పుకుని చేతులు దులిపిన రేవంత్, కొత్తగా పది వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించి, నిరుద్యోగుల నిరసనలను అణచివేయడమే రేవంత్ సర్కార్ విధానంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగుల నోటిఫికేషన్లే వద్దని అంటున్నట్టు కాంగ్రెస్ చెబుతోంది, ఇది వారి బాధను అవమానించడమేనన్నారు. ఇప్పటికైనా నిర్బంధంలో ఉన్న నిరుద్యోగులను విడుదల చేసి, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణతో రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. “కాంగ్రెస్ మోసాన్ని గడపగడపకూ తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తాం” అని ఆయన తుది హెచ్చరిక చేశారు.