CM Revanth : ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే.. కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో(Meeting with Collectors) సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
- Author : Pasha
Date : 16-07-2024 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
CM Revanth : జిల్లాల కలెక్టర్లే రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు, చెవుల లాంటి వాళ్లని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) అన్నారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. కలెక్టర్లు కేవలం ఏసీ గదులకే పరిమితమైతే.. ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో(Meeting with Collectors) సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో మమేకం అయితేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి’’ అని ఆయన కోరారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో కలెక్టర్ల నిర్ణయాలు ఉండాలన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. మీ ప్రతీ చర్య.. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. ఈ ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి’’ అని సీఎం రేవంత్ సూచించారు. ‘‘సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ పాలనను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే’’ అని చెప్పారు. ‘‘ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి’’ అని సీఎం రేవంత్ కోరారు.
Also Read :Deeparadhana: పూజలో నెయ్యి లేదా నూనె.. దేనితో వెలిగిస్తే అదృష్టం వస్తుందో తెలుసా?
‘‘ప్రజావాణి ద్వారా ప్రజలు చెప్పే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించాలి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘మేం డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించాం. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించాం’’ అని గుర్తు చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషన్లర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా పాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం- సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, ఎడ్యుకేషన్, లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నిర్మూలనపై సమావేశంలో చర్చించారు.