Hydraa : సీఎం రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు
Hydraa : హైదరాబాద్‌లోని కొండాపూర్ భిక్షపతి నగర్ ప్రాంతంలో పేదల గుడిసెలు, రేకుల ఇళ్లు హైడ్రా అధికారులు కూల్చివేయడం స్థానిక ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది
- By Sudheer Published Date - 09:56 PM, Sat - 4 October 25

హైదరాబాద్‌లోని కొండాపూర్ భిక్షపతి నగర్ ప్రాంతంలో పేదల గుడిసెలు, రేకుల ఇళ్లు హైడ్రా అధికారులు కూల్చివేయడం స్థానిక ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. తెల్లవారుజామునే భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, ప్రొక్రైనర్లతో వచ్చి కూల్చివేతలు చేపట్టడం వారి ఆవేదనను మరింత పెంచింది. “ఇందిరా గాంధీ మాకు ఈ భూములు ఇచ్చింది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటిని లాక్కుంటున్నాడు” అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
Traffic Challan: ట్రాఫిక్ చలాన్లను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం, చెల్లించడం ఎలా?
ప్రత్యేకించి కుటుంబ నియంత్రణ (ఫ్యామిలీ ప్లానింగ్) కార్యక్రమాల సమయంలో ఈ భూములు కేటాయించబడ్డాయని వృద్ధ మహిళలు గుర్తుచేశారు. “ఆ రోజుల్లో మేము ప్రభుత్వం చెప్పినట్లు ఆపరేషన్ చేయించుకున్నాము, అందుకే ఈ స్థలాలను మాకు ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరూ ఏం అనలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మా ఇళ్లు కూల్చింది” అని కన్నీరు పెట్టుకున్నారు. తులం బంగారం, రూ. 2500, పెన్షన్లు, కరెంట్ బిల్లుల మాఫీ వంటి వాగ్దానాలు నెరవేర్చలేదని, పైగా తమ ఇళ్లు కూల్చివేస్తున్నారని వారు ఆరోపించారు.
“భూముల దందా చేసుకుని బతికే దొంగ రేవంత్ రెడ్డి” అంటూ నిప్పులు చెరిగారు. “సెక్యూరిటీ లేకుండా వస్తే ఇక్కడే పండబెట్టి తొక్కుతాం” అని కొందరు హెచ్చరించారు. “కేసీఆర్ మా చెలకల జోలికి ఎప్పుడూ రాలేదు” అని ఒకరు వ్యాఖ్యానించగా, “రేవంత్ రెడ్డి తెల్లవారుజామున 4 గంటలకు హైడ్రా బుల్డోజర్లు పంపించాడు” అని మరో మహిళ ధ్వజమెత్తింది. చివరికి “రేవంత్ మెడలో చెప్పుల దండలు వేస్తాం” అని మండిపడుతూ, పేదల గుడిసెలను రక్షించాలంటూ డిమాండ్ చేశారు.