Palm Wine : TGSRTC కి తలనొప్పిగా ‘కల్లు’ లొల్లి
Palm Wine : తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. కల్లు బాటిళ్లతో బస్సెక్కిన ఓ మహిళను డ్రైవర్, కండక్టర్ అభ్యంతరం చెప్పి దింపేశారు
- By Sudheer Published Date - 04:43 PM, Mon - 5 May 25

తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో కల్లు (Palm Wine) ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతుంది. చాలామంది తాటి, ఈత కల్లును ఆరోగ్యకరమైన సహజ పానీయం అని భావిస్తూ తాగుతుంటారు. అయితే దీన్ని పట్టణాలకు తీసుకెళ్లే క్రమంలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. కల్లు బాటిళ్లతో బస్సెక్కిన ఓ మహిళను డ్రైవర్, కండక్టర్ అభ్యంతరం చెప్పి దింపేశారు. దీంతో ఆమె ఆగ్రహంతో బస్సు ముందు నిలబడి నిరసన తెలిపింది. ఈ సంఘటనను పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ అయింది.
ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో ఒక సందేహం తలెత్తింది. “ఆర్టీసీ బస్సుల్లో కల్లు తీసుకెళ్లడం నిషేధమా?” అన్న ప్రశ్నపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఎలాంటి స్పష్టమైన నిబంధనలను ప్రకటించలేదు. అయితే సాధారణంగా ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం పరిమిత మోతాదులో కల్లును ప్యాకింగ్ సరిగ్గా చేసి తీసుకెళ్లవచ్చు. కానీ వాణిజ్య ప్రయోజనాల కోసం గానీ, ఎక్కువ మొత్తంలో గానీ తరలిస్తే అది చట్టబద్ధం కాదని భావించవచ్చు. ఇతరులకు అసౌకర్యం కలిగించే రీతిలో తరలించడం కూడా ప్రశ్నార్హం.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం, ఎక్సైజ్ శాఖలు కల్లుతో సంబంధమైన రవాణాపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత వినియోగానికి పరిమితంగా తీసుకెళ్లడాన్ని ఎక్కడి వరకు అనుమతించాలి, ఎంత మోతాదులో అనుమతి ఇవ్వాలి వంటి అంశాల్లో స్పష్టత అవసరం. ప్రజల సంప్రదాయాలను గౌరవిస్తూ, ఇతరుల భద్రత, సౌకర్యాలను కూడా దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. అప్పటివరకు ఇలాంటి ఘటనలు మరిన్ని చర్చలకు, అనవసర వివాదాలకు దారి తీయొచ్చును.
నల్గొండ ఆర్టీసి బస్సు ముందు మహిళ నిరసన
బస్సులోకి కల్లు తీసుకు రావొద్దని డ్రైవర్ చెప్పటం తో ఆగ్రహం
బస్సు ఆపి ఆందోళన చేసిన ప్రయాణికురాలు.@TGSRTCHQ @SajjanarVC pic.twitter.com/FxNmYXk5zh
— Telangana Awaaz (@telanganaawaaz) May 4, 2025