పాలమూరు-రంగారెడ్డిపై చర్చకు కెసిఆర్ వస్తాడా ?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని BRS చీఫ్ KCR ఇటీవల ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది
- Author : Sudheer
Date : 01-01-2026 - 9:34 IST
Published By : Hashtagu Telugu Desk
- పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై చర్చ
- కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి
- నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది
తెలంగాణ అసెంబ్లీ వేదికగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో మరియు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రాజెక్టులో జరిగిన జాప్యం, నిధుల వినియోగం మరియు సాంకేతిక అంశాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. కేసీఆర్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు గణంకాలతో సహా సిద్ధమయ్యారు. ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టడమే లక్ష్యంగా అధికార పక్షం వ్యూహ రచన చేసింది.

Cm Revanth Reddy
చర్చా వేదిక సిద్ధమైన తరుణంలో, అసెంబ్లీ తొలిరోజున కేసీఆర్ హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆయన సభలో కేవలం 3 నిమిషాల పాటు మాత్రమే ఉండి వెనుదిరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం నాడు సభ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో, కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవైపు ప్రభుత్వం చర్చకు రమ్మని సవాల్ విసురుతుంటే, కీలకమైన ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేత అందుబాటులో లేకపోవడం రాజకీయంగా ఎటువంటి సంకేతాలు పంపుతుందోనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రాజెక్టులపై ఆరోపణలు చేసి, వాటిపై చర్చకు రాకపోతే అది పార్టీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందని బీఆర్ఎస్ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది. సభకు వెళ్లకపోతే, ప్రభుత్వం చేసే విమర్శలను అడ్డుకునే వారు ఉండరని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు. మరోవైపు, రేవంత్ సర్కార్ ఈ చర్చను ఉపయోగించుకుని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చూస్తోంది. కేసీఆర్ హాజరుపై నెలకొన్న ఈ సందిగ్ధత, శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలను అత్యంత కీలకంగా మార్చింది.