MLC by election : ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది
తెలంగాణలోని ‘వరంగల్- ఖమ్మం- నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు.
- By Pasha Published Date - 09:08 AM, Sat - 18 May 24

MLC by election : తెలంగాణలోని ‘వరంగల్- ఖమ్మం- నల్గొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం 52 మంది పోటీలో మిగిలారు. 63 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయగా, 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వారు ఇప్పటి నుంచి ప్రచారం చేసుకోవచ్చు. సాధారణ ఎన్నికలకు ఎలాంటి నియమాలు ఉన్నాయో అవే పాటించాల్సి ఉంటుంది. కారు ర్యాలీ, బైక్ ర్యాలీ, రోడ్ షో, బహిరంగ సభలు పెట్టుకోవాలంటే అనుమతి తీసుకోవాలి. ప్రసంగాలలో రెచ్చగొట్టే సందేశాలు, కులం, మతం వంటివి లేకుండా చూసుకోవాలి. సీ- విజిల్ ద్వారా మద్యం, నగదు వంటివి ఎక్కడైనా పంపిణీ చేస్తున్నట్లయితే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చు.
We’re now on WhatsApp. Click to Join
ఓటింగ్‌పై అవగాహన లేక.. చెల్లని 21,636 ఓట్లు
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 2,86,993 మంది పురుషులు, 1,74,788 మంది మహిళలు ఉన్నారు. ఇతరలు ఐదుగురు ఉన్నారు. మొత్తం ఓటర్లు 4,61,786 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి 43,777 ఓట్లు తగ్గాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికే ఓటు హక్కు ఉంటుంది. చదువుకున్న వారు అయినప్పటికీ గడిచిన ఎన్నికల్లో 21,636 ఓట్లు చెల్లలేదు. సాధారణ ఓటు హక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు ప్రాధాన్య క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటెయ్యాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవడంతో ఆ ఓట్లు చెల్లుబాటు కాలేదు.
Also Read :Pokhran Nuclear Tests : భారత్ తొలి అణు పరీక్షకు 50 ఏళ్లు.. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా’ విశేషాలివీ
2021లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ఈ ఉపఎన్నిక వచ్చింది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఉపఎన్నికపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది.