Telangana Railway Projects: 9 జిల్లా కేంద్రాలకు రైల్వే రూట్లు దక్కేనా ? మేడారం, రామప్పలకు రైలు చేరేదెప్పుడు ?
తెలంగాణలోని 9 జిల్లా కేంద్రాలకు ఇప్పటివరకు రైలు మార్గాలు అనుసంధానం కాలేదు.
- By Pasha Published Date - 09:48 AM, Tue - 28 January 25

Telangana Railway Projects: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఫిబ్రవరి 1న భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తమకు కొత్త రైళ్లు, రైల్వే ప్రాజెక్టులు దక్కుతాయనే అంచనాలతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇక ఇదే సమయంలో ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించిన తరహాలో.. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ వివక్షకు గురయ్యే అవకాశం ఉందనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ప్రతీ విషయంలో విస్మరిస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఈసారి కేంద్ర బడ్జెట్ నుంచి తెలంగాణ ప్రజానీకం, ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్న రైళ్లు, రైల్వే ప్రాజెక్టుల చిట్టాను చూద్దాం..
Also Read :Velupillai Prabhakaran : త్వరలోనే జనం ముందుకు ఎల్టీటీఈ ప్రభాకరన్.. నిజమేనా ?
కొత్తగా 9 జిల్లా కేంద్రాలకు రైల్వే రూట్లు
తెలంగాణలోని 9 జిల్లా కేంద్రాలకు ఇప్పటివరకు రైలు మార్గాలు అనుసంధానం కాలేదు. వాటిని కూడా రైల్వే రూట్లకు(Telangana Railway Project) అనుసంధానించాలని, ఆయా జిల్లాలకు నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నిర్మల్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లా కేంద్రాలకు రైల్వే రూట్ వేయాలని అడుగుతున్నారు.
భద్రాచలం, మేడారం, రామప్ప, యాదాద్రి
భద్రాచలం, మేడారం, రామప్ప అనేవి ప్రధాన పుణ్యక్షేత్రాలున్న పట్టణాలు. వీటికి కూడా రైల్వే రూట్ వేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. హసన్‌పర్తి నుంచి భూపాలపల్లికి రైలుమార్గం ప్రాజెక్టు ప్రతిపాదన ఇంకా పెండింగ్ దశలోనే ఉంది. మణుగూరు నుంచి మేడారం మీదుగా రామగుండం వరకు కొత్త రైల్వే రూట్ కోసం ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి నిత్యం ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. వారి సౌకర్యార్ధం ఎంఎంటీఎస్ రైళ్లు వేయడానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును తామే చేపడతామని కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అయితే పనులను ప్రారంభించాల్సి ఉంది.
రీజినల్ రింగు రైల్వే లైన్
హైదరాబాద్ పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగురోడ్డుకు అనుబంధంగా రీజినల్ రింగు రైల్వే లైన్‌ను నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు రూ.12,408 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఈ నిధులు వస్తే రీజినల్ రింగు రైల్వే లైన్ పనులు ప్రారంభం అవుతాయి.
Also Read :Pawan Kalyan Letter : జనసేన శ్రేణులకు పవన్ లేఖ ఎందుకు రాశారు ? కారణమేంటి ?
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టు విజయవాడ ట్రైన్
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని కేంద్రం చెప్పింది. ఈ మార్గంలో రైలు 220 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు గతేడాది రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన సర్వే గత ఏడాది కాలంగా జరుగుతోంది.
సికింద్రాబాద్ టు కాజీపేట రూట్‌లో మూడో రైల్వే లైను
సికింద్రాబాద్ నుంచి కాజీపేట మార్గంలో మూడో రైల్వే లైను నిర్మాణానికి 2014లో సర్వేకు అనుమతించారు. దీనిపై రైల్వేబోర్డుకు 2018లో సర్వే నివేదికను అందించారు. ఇప్పటికీ ఈ రైల్వే లైను నిర్మాణం పూర్తికాలేదు.