Pegasus TRS : పార్లమెంట్లో టీఆర్ఎస్ కు `పెగాసిస్` పరీక్ష
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అసలు సిసలు రంగు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బయట పడనుంది.
- By CS Rao Published Date - 01:16 PM, Mon - 31 January 22

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అసలు సిసలు రంగు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బయట పడనుంది. ఇప్పటి వరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే టీఆర్ఎస్, బీజేపీ నడిచాయి. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అనేసార్లు చెప్పింది. తాజాగా పార్లమెంట్లో పెట్టిన వ్యవసాయ చట్టాల విషయంలోనూ గులాబీ పార్టీ గేమ్ ఆడింది. లోక్ సభలో మోడీ సర్కార్ కు పరోక్షంగా మద్ధతు పలికింది. ఆ తరువాత హుజురాబాద్ ఫలితాలతో యూటర్న్ తీసుకుంది. మోడీ సర్కార్ పై పోరాటానికి సిద్ధం అయింది. అదంతా ఉత్తుత్తి పోరాటంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో పెగాసిస్ వ్యవహారాన్ని తేల్చాలని కాంగ్రెస్ అధిస్టానం భావిస్తోంది. అందుకోసం లోక్ సభ వేదికగా మిగిలిన పార్టీల మద్ధతును కూడగడుతోంది. భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య 2017లో జరిగిన ఒప్పందాన్ని బయలపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆ ఒప్పందంలో భాగంగా పెగాసిస్ స్పైవేర్ టెక్నాలజీని భారత ప్రభుత్వం పొందింది. ఆ టెక్నాలజీతో దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకుడు, జర్నలిస్ట్ ల ఫోన్లను టాప్ చేసింది. ఆ విషయంపై గత పార్లమెంట్ సమావేశల్లో కాంగ్రెస్ పార్టీ, విపక్షాలతో కలిసి నిలదీసింది. అప్పట్లో టీఆర్ఎస్, వైసీపీ ఆ విషయంపై స్పందించలేదు. పైగా మోడీ సర్కార్ కు ఆ రెండు పార్టీలు ఏడేళ్లుగా మద్థతు తెలుపుతున్నాయి.
ఇప్పుడు పెగాసిస్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను న్యూయార్క్ టైమ్స్ బయట పెట్టింది. ఆ ఒప్పందంలోని అన్ని అంశాలపై దర్యాప్తు చేసి పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. దాన్ని బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ మోడీ సర్కార్ ను నిలదీస్తోంది. ఆనాడు పార్లమెంట్ ను పక్కదోవ పట్టిస్తూ సాంకేతిక, సమాచారశాఖ మంత్రి వివరాలను ఇచ్చాడని ఆరోపిస్తోంది. లోక్ సభకు తప్పుడు వివరాలు ఇచ్చిన ఆయన మీద ప్రివిలేజ్ కమిటీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.పెగాసిస్ వ్యవహారాన్ని తేల్చాలని విపక్షాలన్నీ ఒకటై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. అందుకు టీఆర్ఎస్ పార్టీ మద్థతు పలుకుతుందా? లేదా? అనేది సందిగ్ధం. మోడీ ఆధ్వర్యంలో 2014లో ఏర్పాడిన ఎన్డీయే పలు బిల్లులను ప్రవేశపెట్టింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. సీఏఏ లాంటి వివాదస్పద బిల్లును కూడా ఉభయ సభల్లో ఆమోదింప చేసింది. సంచలనం రేపిన వ్యవసాయ చట్టాల వరకు పలు బిల్లులను ఏడేళ్ల కాలంలో ప్రవేశ పెట్టింది. ఆ బిల్లులకు టీఆర్ఎస్ పార్టీ మద్ధతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు టీఆర్ఎస్ ఓటు చేసింది. ఆయుష్మాన్ భవకు కూడా జై కొట్టింది. ఇవన్నీ ఆ రెండు పార్టీలకు ఉన్న స్నేహభావాన్ని చూచిస్తున్నాయి.
హుజూరాబాద్ ఫలితాల తరువాత ఒక్కసారిగా మోడీ సర్కార్ పై వ్యతిరేకంగా టీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తోంది. ఢిల్లీకి వెళ్లి తేల్చుకోవాలని మంత్రులను, ఎంపీలను వరి ధాన్యం అంశంపై కేసీఆర్ రియాక్ట్ అయ్యాడు. క్షేత్రస్థాయిలో బీజేపీ మీద తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనకు దిగాడు. నేరుగా కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ఒక రోజు ధర్నాకు హాజరు అయ్యాడు. ఆ తరువాత నుంచి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ షురూ అయింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జీవో 317ను వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన క్రమంలో కేసులు పెట్టి జైలుకు పంపే వరకు కేసీఆర్ సర్కార్ వెళ్లింది. ఆ సందర్భంగా ఢిల్లీ బీజేపీ నేతలు వరుసగా రాష్ట్రానికి వచ్చారు. కేసీఆర్ సర్కార్ మీద పలు రకాలు విమర్శలు, ఆరోపణలు చేయడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటించారు. త్వరలోనే కేసీఆర్ ను జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించి వెళ్లారు.ఫెడరల్ ఫ్రంట్ అంటూ మళ్లీ కేసీఆర్ ప్రయత్నాలను ప్రారంభించాడు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ పనిచేస్తుందని స్లోగన్ అందుకున్నాడు. బీహార్, తమిళనాడు, ఒరిస్సా , కర్నాటక రాష్ట్రాలకు చెందిన సమాంతరం పార్టీల నేతలతో మంతనాలు సాగించాడు. వరి ధాన్యం, జీవో 317 తదితర అంశాలపై బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశాడు. ఇప్పుడు పెగాసిస్ అంశం వచ్చింది. పైగా ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయం ఇది. దీంతో కాంగ్రెస్ పార్టీ పెగాసిస్ అంశాన్ని పార్లమెంట్ వేదికగా హైలెట్ చేయడానికి సిద్ధం అయింది. విపక్షాలను కలుపుకుని మోడీ సర్కార్ ను నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షంగా వ్యూహం రచించింది. ఆ క్రమంలో టీఆర్ఎస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని ఇప్పటికే తెలంగాణ లీడర్లు నిలదీస్తున్నారు. ప్రస్తుతానికి పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ విపక్షాలతో కలిసి వెళతాడా? లేక మధ్యేమార్గంగా దూరంగా ఉంటాడా? అనేది చర్చనీయాంశం అయింది.ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో గులాబీ ఎంపీలు వ్యవహరించే తీరు ఆధారంగా ఆ పార్టీ బీజేపీకి స్నేహపూర్వకమా? లేక వ్యతిరేకమా? అనే అంశాన్ని ఫోకస్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటి వరకు తెర వెనుక మిత్రునిగా వ్యవహరించిన టీఆర్ ఎస్ ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకునే పరిస్థితి ఏర్పడింది. సో…పార్లమెంట్ వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు ఏమి చేస్తారో..చూద్దాం.