TPCC Meeting : రేపు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. ఎజెండా ఇదీ !
TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం (జనవరి 3న) మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతోంది.
- By Pasha Published Date - 06:26 PM, Tue - 2 January 24

TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం (జనవరి 3న) మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్‌లో జరగబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్‌లో కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇంచార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి కూడా పాల్గొంటారు. సమావేశంలో పాల్గొనేందుకు దీపాదాస్ మున్షి ఇవాళ రాత్రికల్లా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌గా నియమితులయ్యాక దీపాదాస్ మున్షి హైదరాబాద్‌కు వస్తుండటం ఇదే తొలిసారి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగనున్న పార్టీ మొదటి సమావేశం కావడంతో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మీటింగ్(TPCC Meeting) వివరాలను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (ఇంచార్జ్ ఆర్గనైజేషన్) మహేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వేదికగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నామినేటెడ్ పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తెలంగాణలో మూడు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్న కాంగ్రెస్.. ఈ సారి ఎన్నికల్లో 17 స్థానాలనూ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఆరు గ్యారెంటీల అమలుపై క్షేత్రస్థాయిలోని అభిప్రాయాలను ఈ సమావేశం సందర్భంగా తెలుసుకోనున్నారు. బుధవారం జరిగే మీటింగ్‌లోని పాయింట్స్ ఆధారంగా నివేదిక రూపొందించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈనెల 4న(గురువారం) ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో దాన్ని సమర్పించనున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్ రావ్ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్ చార్జిగా నియమితులైన ఆయనకు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేతలు కలిసి అభినందనలు తెలిపారు.