Heavy Rains in Telangana : రాబోయే ఐదు రోజుల్లో ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rains in Telangana : రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు
- By Sudheer Published Date - 06:47 PM, Sun - 6 July 25

తెలంగాణ(Telangana )లో వర్షాలు మళ్లీ ఉధృతంగా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్‌లను జారీ చేశారు. ఆదివారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం నాడు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం ఈ జిల్లాల్లో వర్షాలు మరింత ఉధృతంగా కురుస్తాయని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇక జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.
బుధవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయని, ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.