BRS MLAs Disqualification : ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ వేర్వేరుగా వేసిన పిటిషన్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది.
- Author : Pasha
Date : 08-07-2024 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
BRS MLAs Disqualification : కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ వేర్వేరుగా వేసిన పిటిషన్లను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్లపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదన వినిపించారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు(MLAs Disqualification Petition) వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విచారణను హైకోర్టు గురువారానికి(ఈనెల 11) వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో ఆదివారం (జులై 07న) బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కలిశారు. మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్ రావు కూడా చంద్రబాబును కలిసినట్లు సమాచారం. అయితే తాము(BRS MLAs) మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశామని వీరంతా అంటున్నారు. ఏపీ సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్నందుకు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపామని చెబుతున్నారు. చంద్రబాబును కలిసిన ఈ నేతల్లో ఎక్కువమంది గతంలో టీడీపీలో పనిచేసినవారే కావడం గమనార్హం. ఏపీలో టీడీపీ విజయం సాధించటంతో పాటు తెలంగాణలో సీఎం రేవంత్‌తో చంద్రబాబు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో తెలంగాణలో మళ్లీ టీడీపీ పుంజుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈక్రమంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ టీడీపీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.