Rythu Bandhu Update : రైతు బంధు నిబంధనల్లో మార్పు.. కౌలు రైతులకూ సాయం
Rythu Bandhu Update : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది.
- By Pasha Published Date - 03:23 PM, Sat - 10 February 24

Rythu Bandhu Update : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. నిజమైన అర్హులకే రైతు బంధు ఇస్తామని తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకం కింద అసలు రైతుల కంటే పెట్టుబడిదారులు, అనర్హులే ఎక్కువ లాభం పొందారన్నారు. సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు.. ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని సభకు తెలిపారు. రైతు బంధులో అక్రమాలను గుర్తించిన నేపథ్యంలో ఈ పథకం నిబంధనలను మళ్లీ సమీక్షించి, నిజమైన అర్హులకే ‘రైతు భరోసా’ కింద పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15,000 చొప్పున పెట్టుబడి సాయం అందించడాన్ని కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా(Rythu Bandhu Update)కింద పెట్టుబడి సాయాన్ని ఇస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొని పెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతుబంధు కింద సాయం అందింది. ఇది అక్రమం. ఇచ్చిన జీవోకు విరుద్ధంగా పథకాన్ని వర్తింపజేయడం అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమైంది’’ అని మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని బడ్జెట్ ప్రసంగంలో ఆయన తెలిపారు. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు మొత్తం 19,746 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరును పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నకిలి విత్తనాల సమస్య కూడా తీవ్రంగా ఉండేదని భట్టి విక్రమార్క అన్నారు. తగిన చర్యలు చేపట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.