Telangana Govt Big Move: జాయింట్ కలెక్టర్ పోస్టులు రద్దు – అదనపు కలెక్టర్లకే ఫారెస్ట్ బాధ్యతలు
ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నియామకాలు 1967 ఫారెస్ట్ యాక్ట్ (Forest Act 1967) మరియు 1927 నాటి చట్టాల (Forest Act 1927) నిబంధనల ప్రకారం అమలు అవుతున్నాయి.
- By Dinesh Akula Published Date - 10:54 PM, Fri - 24 October 25
హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అటవీ భూములకు సంబంధించిన పరిపాలన వ్యవస్థలో కీలక మార్పు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని జిల్లాల్లోని అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌లుగా (Forest Settlement Officers – FSO) నియమిస్తూ నూతన ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతోపాటు ఇప్పటివరకు ఉన్న జాయింట్ కలెక్టర్ (Joint Collector) పదవులను రద్దు చేస్తూ, ఆ బాధ్యతలను అదనపు కలెక్టర్లకే అప్పగించింది. ఈ మార్పుతో అటవీ భూముల సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్‌మెంట్ వంటి పనులు ఇకపై వారిచేతనే నిర్వహించబడనున్నాయి.
ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నియామకాలు 1967 ఫారెస్ట్ యాక్ట్ (Forest Act 1967) మరియు 1927 నాటి చట్టాల (Forest Act 1927) నిబంధనల ప్రకారం అమలు అవుతున్నాయి. ఈ నిర్ణయం ద్వారా పాలనలో వేగం, పారదర్శకత, బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.
ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌ల (FSO) బాధ్యతల్లో అటవీ భూముల హక్కుల నిర్ధారణ, అటవీ ప్రాంతాల పరిధి నిర్ణయించడం, భూ వివాదాల పరిశీలన, అవకతవకలపై విచారణ, చట్టపరమైన ప్రకటనలు జారీ చేయడం వంటి అంశాలు ఉంటాయి. వారికి అవసరమైతే అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించే అధికారం కూడా ఉంటుంది.
ఈ మొత్తం ప్రక్రియను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
సర్కారు వర్గాల ప్రకారం, అటవీ భూములకు సంబంధించిన సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం, భూసమస్యలపై అవకతవకలను అరికట్టడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.