Telangana Free Bus Travel Scheme : మహిళల కన్నుల్లో వెలుగు
- By Sudheer Published Date - 07:08 PM, Fri - 22 December 23

డా. ప్రసాదమూర్తి
ఎక్కడ మహిళల కన్నుల్లో వెలుగు పూలు పూస్తాయో, వారి హృదయపు లోతుల్లో ఆనందం వెల్లివిరిసి అది వారి నవ్వుల నిండా చూపుల నిండా వెన్నెలై కురుస్తుందో, అక్కడ సుఖశాంతులు వర్ధిల్లుతున్నట్టు లెక్క. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అన్నారు మన పూర్వీకులు. అంటే స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు నడయాడతారు అని అర్థం. సరిగ్గా తెలంగాణలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళల హృదయాలనుండి వారి చూపుల వరకు సంతోషాల కాంతి ప్రసరించి రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు వాగ్దానాలలో అతి ముఖ్యమైన వాగ్దానం మహిళలకు ఉచిత బస్సు సర్వీసు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా అమలు చేసిన వాగ్దానం ఇదే. ఈ వాగ్దానం ఎలా అమలు చేస్తారని, దీని వల్ల ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోతుందని, టిక్కెట్టు కొనుక్కునే స్తోమత ఉన్న మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతుందని, ఉచిత ప్రయాణం కాబట్టి మహిళలు వారి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన ప్రాంతానికి అవసరం లేకున్నా ఊరికే ప్రయాణాలు చేస్తారని, ఇలా ఎన్నెన్నో అపసవ్యపు కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.
మహిళల పట్ల ఇలాంటి విమర్శలన్నీ వారి స్వేచ్ఛను, వారి భద్రతను, వారికి దక్కిన అవకాశాన్ని అవహేళన చేయడమే. ఉచిత బస్సు ప్రయాణాన్ని నగరం నుంచి గ్రామాల దాకా మధ్య తరగతి, దిగువ తరగతి మహిళలు, శ్రామిక మహిళలు ఒక వరంగా భావిస్తున్నారు. నగరంలో నాలుగు ఇళ్లల్లో పని చేసుకుని బతికే మహిళ ఎక్కడో గ్రామంలో ఉండే తల్లితండ్రులను చూడాలంటే చార్జీలకు అయ్యే ఖర్చుకు భయపడి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న అతుకుల బతుకుల ఆడపడుచులు నానాటికి పెరిగే బస్సు చార్జీలను భరించలేక, వచ్చే చిన్నపాటి ఆదాయంలో ప్రయాణానికి ఖర్చయిపోతూ ఉండటం వల్ల ఎంతో దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రసాదించిన ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వారికి ఒక అద్భుతమైన వరంగా మారింది. ఈ పథకాన్ని అమలు చేసిన నాటి నుంచి ఇప్పటివరకు మూడు కోట్ల మంది మహిళలు జీరో టిక్కెట్ మీద ప్రయాణించినట్టు తెలుస్తోంది. దీనికి అయ్యే ఖర్చు కోట్లలోనే ఉంటుంది. కానీ దీనివల్ల మహిళల మనసుల్లో ప్రభుత్వం పట్ల పెల్లుబికే సానుభూతి, సంతృప్తి ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం. ఈ పథకం అమలులో అనేక లోపాలు, కష్టనష్టాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కడకంటా కొనసాగించాలి. అలాగే టిక్కెట్ కొనుక్కుని ప్రయాణించగలిగే ఆర్థిక స్థితిగతులు ఉన్న మహిళలు ఈ ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకోకుండా టిక్కెట్ కొనుక్కుని ప్రయాణిస్తే అది వారి సముచిత నిర్ణయం అవుతుంది. ప్రభుత్వం పట్ల రాష్ట్రం పట్ల వారి బాధ్యతను తెలియజేస్తుంది. అలా ప్రయాణించాలనుకునే మహిళలకు తప్పనిసరిగా ఆ అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. అధికారంలో ఉన్నవారు ఏం చేసినా అందులో లోపాలను వెతకడమే ప్రతిపక్షంలో ఉన్న వారి పని. అంతేకాదు ప్రతిపక్ష పార్టీకి సానుభూతిపరులైన, మద్దతుదారులైన, కార్యకర్తలైన వారు రాష్ట్రమంతా ఉంటారు. వారు సోషల్ మీడియాలో ఎన్నో అపహాస్యపు మాటలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారి విమర్శలకు మాటలకు పెద్దగా పట్టింపు ఉండదు. రాష్ట్రం నలుమూలలా మహిళలంతా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటూ ఎంత సంబరపడిపోతున్నారో, ఆ ఆనందం ముందు ఏ విమర్శలూ, ఏ వెకిలి వ్యాఖ్యానాలూ పనిచేయవు. ముందే మనం చెప్పుకున్నట్టు మహిళ ఎక్కడ ఆనందంగా స్వేచ్ఛగా భద్రతలో ఉంటుందో అక్కడ నిజంగా దేవతలు నడయాడతారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మరో వాగ్దానంలో మహిళలకు బ్యాంకు అకౌంట్లో రెండున్నర వేలు వేస్తామని. దాన్ని కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తే రాష్ట్రం యావత్తు స్త్రీ లోకం హృదయాన్ని ఈ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం గెలుచుకున్నట్టే అవుతుంది. పథకాలు ప్రారంభించడం వేరు, చివరి వరకు దిగ్విజయంగా కొనసాగించడం వేరు. ఆరంభ శూరత్వం ప్రదర్శించకుండా కడవరకు ఈ వాగ్దానాలను ప్రభుత్వం నిలుపుకుంటుందని ఆశిద్దాం. అప్పుడు మహిళలంతా మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి తమ సంతోషపూర్వక మద్దతును ప్రకటిస్తారు. మహిళ నవ్వుతూ ఉంటే చాలు ఆ రాష్ట్రం మొత్తం నవ్వుతున్నట్టే.
Read Also : Pallavi Prashanth : బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు భారీ ఊరట..