TS Congress Protest: రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ రణరంగం
దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన క్రమంలో హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ రణరంగంగా మారింది.
- Author : Hashtag U
Date : 16-06-2022 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన క్రమంలో హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ రణరంగంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై ఈడీ వేధింపులకు నిరసనగా ఛలో రాజ్‌భవన్ కార్యక్రమం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపధ్యంలో హైదరాబాద్‌లో ఛలో రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తలకు దారితీసింది.
ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా బారిగెట్లను అడ్డుపెట్టినా.. ఆగని కార్యకర్తలు బారిగెట్లను తోసేసి రాజ్ భవన్ వైపు పరుగులు తీశారు. ఆ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు పోలీసులను తోసేసి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళన రచ్చ రచ్చగా మారింది. ఖైరతాబాద్ రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ బస్సులు ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు అందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీపులు అడ్డుకొని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.