TS-BJP, Janasena Alliance : తెలంగాణలో జనసేన ‘పవనం’ ఎటు వీస్తుంది?
తెలంగాణలో జనసేన (Janasena) పార్టీకి 9 సీట్లు కేటాయించడానికి బిజెపి (BJP) సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
- By Sudheer Published Date - 12:48 PM, Sun - 5 November 23

By: డా. ప్రసాదమూర్తి
Telangana BJP, Janasena Alliance : తెలంగాణలో జనసేన (Janasena) పార్టీకి 9 సీట్లు కేటాయించడానికి బిజెపి (BJP) సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. జనసేనకు కేటాయించిన ఆ తొమ్మిది సీట్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ తొమ్మిది స్థానాలలో జనసేన పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేదానికంటే, ఆ పార్టీ బలం ఎంత, ఆ బలం ఎవరికి లాభం చేకూర్చేదిగా ఉంటుంది అనే విషయం మీదే ఎక్కువ చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ 100 సీట్లు పైగా తన అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా వందకు పైగా సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. అధికార బీఆర్ఎస్ (BRS) మొత్తం స్థానాలకు ఎప్పుడో తన అభ్యర్థుల జాబితాను ఎన్నికల నోటిఫికేషన్ కు 40 రోజులు ముందే ప్రకటించింది. నామినేషన్ డేటు ఇప్పుడు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల మిగిలిన స్థానాల విషయంలో ఒక స్పష్టత వస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీకి కేటాయించిన తొమ్మిది స్థానాలలో విజయావకాశాలు ఎవరికి మెరుగుగా ఉన్నాయి, ఆ స్థానాల్లో జనసేన బిజెపి ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల ఎవరికి నష్టం..ఎవరికి లాభం అనే విషయాల మీద రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు ఎన్నో ఊహాగానాలు చేస్తున్నారు.
జనసేన (Janasena) తో బిజెపికి ఎప్పటినుంచో అనుబంధం ఉన్నమాట అందరికీ తెలుసు. అది తెలంగాణ(Telangana)లో ఎన్నికల పోటీ దాకా విస్తరిస్తుందనే విషయంలో ఇప్పటివరకూ ఒక స్పష్టత రాలేదు. గత రెండు నెలలుగా బిజెపి నాయకులు పవన్ కళ్యాణ్ తో ఈ విషయంలో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. గత నెల బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. మొత్తానికి ఇప్పటికి పవన్ కళ్యాణ్ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే విషయంలో బిజెపికి ఒక స్పష్టత వచ్చినట్టుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఆంధ్రా సెటిలర్ల సంఖ్య అధికంగా ఉన్న నియోజకవర్గాల మీద ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. అక్కడ తెలంగాణ (Telangana) ఓటర్లతో పాటు ఆంధ్రా ఓటర్ల మద్దతు ఏ పార్టీకి ఎక్కువగా ఉంటే ఆ పార్టీకి విజయావకాశాలు ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభిమానుల ఓట్లు తమ వైపు మలచుకోవడానికి అటు బిజెపి ఇటు కాంగ్రెస్ మరోవైపు అధికార బీఆర్ఎస్ పలు రకాల ప్రయత్నాలు సాగిస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. ఆంధ్రాలో జనసేన, తెలుగుదేశం పొత్తు కొనసాగుతోంది. కానీ తెలంగాణలో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది.
ఈ పొత్తులో తెలుగుదేశం పార్టీ చేరలేదు. పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలంగాణలో పోటీ చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినా, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు దానికి అంగీకరించలేదు. కానీ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాదు, ఖమ్మం, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఆ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ఆదేశాలు జారీ చేయలేదు. కనుక టిడిపి అభిమానులను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందుకోసం కేసిఆర్ వైసిపి అభిమానులకు ఆగ్రహం తెప్పించే సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు లాంటి వ్యాఖ్యానాలు కూడా చేశారు. కానీ టిడిపి నాయకత్వం ఈ విషయంలో చాలా గుంభనంగా ఉంది.
ఎన్నికల సమయానికి తమ శ్రేణులకు రహస్య సంకేతాలు ఆ పార్టీ అందించవచ్చు. అయితే బిజెపి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని జనసేన పార్టీ (Janasena Party) ద్వారా తెలుగుదేశం పార్టీ ఓట్లను కూడా తమవైపు మళ్లించుకునే ప్రయత్నాలు మరో పక్క సాగిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కు కేటాయించిన తొమ్మిది స్థానాలు కూడా ఆంధ్రా ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉన్నచోట మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి స్థానాలు హైదరాబాదులో ఆంధ్రా ఓటర్లకు కీలకమైనవి. ఆ రెండూ పవన్ కళ్యాణ్ కి కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే ఆంధ్రా ఓటర్లు అధికంగా ఉన్న నాగర్ కర్నూల్, కోదాడ, పాలేరు, మధిర, కొత్తగూడెం, అశ్వరావుపేట స్థానాలను జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ స్థానాలన్నీ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినవి. ఈ నియోజకవర్గాలను జనసేన పార్టీకి కేటాయించడం ద్వారా, ఆంధ్రాలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నందువల్ల, ఆ పార్టీ అభిమానులు కూడా జనసేన పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తారని బిజెపి అంచనా.
ఆంధ్రాలో బిజెపి తో పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. తెలంగాణలో సరే సరి. మరి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలంగాణలో జనసేన పార్టీ (Janasena Party)కి ఓటు వేస్తారు అని కచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ లాంటి వారు చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబుకు మద్దతుగా జరిగిన ప్రదర్శనలను అడ్డుకున్న నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆగ్రహంగా ఉన్నాయి. వారెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ కు టిడిపి శ్రేణులు ఓటు వేస్తాయని నమ్మకంగా చెప్పలేం. అలాగే జనసేన పార్టీ బిజెపి మద్దతుతో గెలిచే అవకాశం ఉందా లేదా అనే విషయం కూడా ఓటర్లు అంచనా వేసుకుంటారు.
బిజెపి జనసేన కలిసినా వారు గెలవడానికి అవకాశం లేదని ఆంధ్రా ఓటర్లు భావిస్తే, ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు అనుకుంటే, వారు అనివార్యంగా కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలే మెరుగ్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా గమనించాలి. బిజెపి, జనసేన పార్టీల పోటీ ఈ తొమ్మిది నియోజకవర్గాలలో విజయం వైపు నిలవకపోయినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయడం తన విజయం కోసం కాకపోయినా కాంగ్రెస్ పరాజయం కోసం పనికొస్తుందని బిజెపి భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. బిజెపి కోరుకుంటున్నాది కూడా అదే అని పలువురి అభిప్రాయం. ఒకవేళ అధికార బీఆరెస్ ఓటమి కోసం కృషి చేయాలని తెలుగుదేశం అభిమానులు గట్టిగా అనుకుంటే వారు కాంగ్రెస్కే ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం పరిస్థితి ఊహకందని సంక్లిష్టంగా మారిందని చెప్పాలి.
బిజెపి, పవన్ కళ్యాణ్ బంధం ఆంధ్ర ఓటర్లను ఎంత గట్టిగా ఆకర్షిస్తుందో అంత గట్టిగా కాంగ్రెస్ ను దెబ్బ తీయవచ్చు. కానీ ఆంధ్రా సెటిలర్లు గెలవని అభ్యర్థికి ఓటు వేయడం కంటే గెలిచే అభ్యర్థికి ఓటు వేయాలని నిర్ణయించుకుంటే అది కాంగ్రెస్ కో, బీఆర్ఎస్ కో మేలు జరగవచ్చు. ఏది ఏమైనా తెలంగాణలో పవన్ పోటీ అతనికి గాని బిజెపి కి గాని మేలు చేయకపోవచ్చు కానీ కాంగ్రెస్ కు ఎంతోకొంత కీడు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విజ్ఞుల అంచనా.
Read Also : CM KCR : నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన