Rs 4000 Pension : 4వేల పింఛను అమల్లోకి వచ్చేది ఎప్పుడు.. కొత్త అప్‌డేట్
Rs 4000 Pension : తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగుల పింఛను రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
- By Pasha Published Date - 09:40 AM, Mon - 22 January 24

Rs 4000 Pension : తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛను రూ.4,000, దివ్యాంగుల పింఛను రూ.6,000 చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో పింఛనును ఎప్పుడు పెంచుతారా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల నుంచే పింఛను పెంపు ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చి నుంచే పింఛను పెంపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాధారణ పింఛను రూ.2,016, దివ్యాంగుల పింఛను రూ.3,016 గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు, 15,60,707 మంది వితంతువులు, దివ్యాంగులు 5,03,613 మంది , బీడీ కార్మికులు 4,24,585 మంది, ఒంటరి మహిళలు 1,42,394, గీత కార్మికులు 65,307, చేనేత కార్మికులు 37,145, హెచ్‌ఐవీ బాధితులు 35,998 ఉన్నారు. ఇలా వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ఈ పెన్షన్ల అమలు కోసం ప్రతినెలా దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతోంది. ఆసరా పింఛన్లను ఈ నెలలో పాత పంథాలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు. కొత్త పింఛన్ల కోసం ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో 24.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు(Rs 4000 Pension) ఉండగా.. కొత్తవాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షలకు పెరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారా?
అభయహస్తం పథకాల అమలుకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. రాష్ట్రంలో 89.98 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కానీ రూ.500కు గ్యాస్ సిలిండర్‌కు రాష్ట్రవ్యాప్తంగా 91,49,838 దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారా? లేనిపక్షంలో అర్జీదారులకు రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోరా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Uric Acid : యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్.. తినాల్సిన ఆకులు, తినకూడని ఫ్రూట్స్
అస్తవ్యస్తంగా మారిన ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేషన్ దుకాణాలు, డీలర్లు, సంబంధిత శాఖ అధికారులపై నిత్యం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డీలర్లలో పెద్ద సంఖ్యలో బినామీలున్నట్లు ఆరోపణలు వస్తుండటంతో చక్కదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరి 31లోగా బినామీ డీలర్లను గుర్తించి ఏరివేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు రేషన్ దుకాణాల్లో విస్త్రతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను చక్కదిద్దాలంటే మొదటగా బినామీ డీలర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు రేషన్ దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బినామీలు నిర్వహిస్తున్నట్లు తేలితే సదరు డీలర్‌షి్‌పను రద్దు చేయనున్నారు. తనిఖీల తీరు, గుర్తించిన బినామీలు, వారిపై తీసుకున్న చర్యలతో ఈ నెల 31లోగా నివేదికలు ఇవ్వాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమీషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. అధికారులు ప్రతి రేషన్ దుకాణాన్ని తనిఖీ చేస్తూ డీలర్‌పై ఆరా తీస్తున్నారు.