Jupally Krishna Rao : జూపల్లి ని దెబ్బ తీయాలని చేస్తుందేవరు..?
Jupally Krishna Rao : తెలంగాణ మంత్రిగా కీలక శాఖలను నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు ఇటీవల వరుసగా వివాదాల కేంద్రబిందువుగా మారుతున్నారు
- By Sudheer Published Date - 10:36 AM, Wed - 29 October 25
తెలంగాణ మంత్రిగా కీలక శాఖలను నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు ఇటీవల వరుసగా వివాదాల కేంద్రబిందువుగా మారుతున్నారు. తాజాగా ఆయన ఆర్టీఐ దరఖాస్తులు వేసారనే ఆరోపణలు మీడియా ద్వారా వెలువడటం పెద్ద చర్చకు దారి తీసింది. ప్రభుత్వం తరపున ఉన్న మంత్రికి అవసరమైన సమాచారాన్ని పొందేందుకు శాఖాధికారులను నేరుగా ఆదేశించే అధికారం ఉంది. ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరడం అసంభవం. అయినప్పటికీ భూముల కేటాయింపులు, టెండర్లపై ఆరా తీసేందుకు మంత్రే ఆర్టీఐ వేశారంటూ ప్రచురించిన వార్తలు మంత్రి పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించేంతగా ఉద్రిక్తతను పెంచాయి. తనపై కావాలనే కుట్ర జరుగుతోందని జూపల్లి ఘాటుగా స్పందించారు.
Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి..ప్రమాదంలో వేలాదిమంది
ఆర్టీఐ వివాదానికి ముందు ఎక్సైజ్ శాఖలో హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ల వ్యవహారం కూడా పెద్దఎత్తున రచ్చకు దారి తీసింది. టెండర్ల ప్రక్రియలో ఆలస్యం చేస్తూ పాత వెండర్లకు ప్రయోజనం కల్పించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు జూపల్లి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై చేశారు. ఈ వివాదం చివరికి రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకునే స్థాయికి చేరుకుంది. దీంతో మంత్రి పాలనాపరమైన జోక్యం పై ప్రభుత్వ వర్గాల్లోనూ, ప్రతిపక్షంలోనూ చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను వేధిస్తోందని, అవినీతి ప్రయోజనాల వల్లే ఈ గొడవ అంటూ బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేసింది.
ఈ రెండు పరిణామాలు కలిసి మంత్రి జూపల్లిపై దాడులు మరింత పెరగడానికి దారితీశాయి. జూపల్లి నిర్వహిస్తున్న శాఖలు అధిక ఆదాయం వచ్చే రంగాలు కావడంతో రాజకీయంగా ఆయనను బలహీనపర్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఒక వర్గం మంత్రిని టార్గెట్ చేస్తోందని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆయన అనుచరులు అంటున్నారు. వరుస వివాదాలు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశముండడంతో, ఈ వ్యవహారంలో జూపల్లి ఎలాంటి లీగల్ అడుగులు వేస్తారో, రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.