SLBC Operation : 8 మంది కోసం ఉత్కంఠ.. ఏంజరగబోతుందో..?
SLBC Operation : నీటిని తోడిన తర్వాత బురద తొలగించడానికి ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాలని నిర్ణయించారు
- By Sudheer Published Date - 02:12 PM, Mon - 24 February 25

నల్గొండ జిల్లా శ్రీశైలం ఎడమగట్టు బ్యాంక్ కాల్వ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాదం ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి 48 గంటలు గడుస్తున్నా, టన్నెల్‌లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. రెస్క్యూ టీములు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి బృందాలతో సహా విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడం కలవరపెడుతోంది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, జక్తాజస్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు అనే కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలతో గాలించినా వారి ఆచూకీ ఎలాంటి సమాచారం అందలేదు.
Delhi Assembly : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక
రెస్క్యూ టీం టన్నెల్ లోపల 500 మీటర్ల మేర బురద పేరుకుపోయిందని గుర్తించింది. టన్నెల్ 13వ కిలోమీటర్ వరకూ నీరు నిలిచి ఉండగా, 13.5 కిలోమీటర్ల దాటి బురదతో కూడిన నీరు ఉంది. పైకప్పు కూలడంతో లోపల 15 అడుగుల మడుగు ఏర్పడింది. ప్రమాద స్థలానికి ముందు 2 కి.మీ వరకు నీళ్లు నిలిచి ఉండటంతో రెస్క్యూ టీమ్ కు లోపలికి వెళ్లడం కష్టంగా మారింది. అక్కడే చిక్కుకున్న కార్మికులు ప్రాణాలతో ఉన్నారా? లేదా? అనే అనుమానం నెలకొంది. టన్నెల్ బోరింగ్ యంత్రం ధ్వంసం కావడంతో, అందులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ ను నడపడం కూడా కష్టమైంది.
AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స
రక్షణ చర్యలు అత్యంత క్లిష్టంగా మారడంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ప్రతిక్షణం పరిణామాలను సమీక్షిస్తున్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను ఎలా రక్షించాలనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. నీటిని తోడిన తర్వాత బురద తొలగించడానికి ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపగా, కార్మికుల కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. రెస్క్యూ టీమ్ రాత్రింబవళ్లు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠ కు దారి తీస్తుంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.