Singareni Polls: సింగరేణిలో పోరులో సైరన్ మోగించేదెవరో.. మినీ యుద్ధంలో గెలుపు ఎవరిదో!
మినీ సెమి ఫైనల్స్ గా భావించే అన్ని పార్టీలకు సింగరేణి ఫలితాలు కీలకంగా మారనున్నాయి.
- By Balu J Published Date - 01:37 PM, Thu - 28 September 23

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మినీ యుద్ధంగా భావించే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికలు అక్టోబర్ 28న జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. అక్టోబరు 6, 7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 9. మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అయితే, SCCLకి చెందిన 13 కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దని యాజమాన్యాన్ని కోరాయి.
అయినప్పటికీ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లా యంత్రాంగం సహకారం లేకుండా లేబర్ కమిషనర్ అధికారులు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ఎస్‌సిసిఎల్ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇక ఆలస్యం చేయకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
కాగా సింగరేణి ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్‌లో ఉంది. సింగరేణిలో దాదాపు రెండు దశాబ్దాల తరువాత ప్రతిష్ఠాత్మకంగా జాతీయ స్థాయిలో రెస్క్యూ పోటీలు జరుగుతున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 20కిపైగా మైనింగ్ సంస్థల బృందాలు ఇక్కడికి వస్తున్నాయి. అతి కీలకకమైన 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధమవుతున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోకుండా.. క్షేత్రస్థాయి పరిస్థితులను కనీసం అంచనా వేయకుండా, మెజార్టీ యూనియన్ నాయకుల అభిప్రాయాలకు విలువనీయకుండా.. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అధికారయంత్రాంగం, అటు కార్మిక సంఘాల సహకారం లేకుండా ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల షెడ్యూల్‌ను ఉపసంహరించుకోవాలని, తమ అభిప్రాయాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతుండటం గమనార్హం. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ కార్మికులకు 32 శాతం బోనస్ ప్రకటించడంతో ఆపార్టీకే గెలుపు అవకాశాలున్నాయి. కాగా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సింగరేణిని ప్రభావితం చేస్తూ వస్తోంది. అయితే ఈసారి ఈటల రాజేందర్ నుంచి ఆ పార్టీ కొంత పోటీ ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా సింగరేణి ఏరియాలపై కొంత మేర పట్టుంది. అయితే మినీ సెమి ఫైనల్స్ గా భావించే అన్ని పార్టీలకు సింగరేణి ఫలితాలు కీలకంగా మారనున్నాయి.
Also Read: Gautam Gambhir: శ్రీవారి సేవలో గౌతర్ గంభీర్, భారత్ వరల్డ్ కప్ గెలుస్తుందని ధీమా