Reactor Blast: పటాన్‌చెరులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు..
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం చోటుచేసుకున్న ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
- Author : Kavya Krishna
Date : 30-06-2025 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
Reactor Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఇవాళ ఉదయం చోటుచేసుకున్న ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సీగాచి కెమికల్స్ అనే ప్రముఖ రసాయన పరిశ్రమలో రియాక్టర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో, అక్కడ పని చేస్తున్న కార్మికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇంకా 20 మంది పైగా గాయాలపాలయ్యారు.
పేలుడు సమయంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. రియాక్టర్ పేలుడు ధాటికి కొంతమంది గాల్లోకి ఎగిరి పడిపోయినట్లు, 100 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడినట్లు ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. భారీ శబ్దంతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. మంటలు తారాస్థాయికి చేరడంతో పరిశ్రమ మొత్తంగా మంటల్లో చిక్కుకుంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. గాయపడిన కార్మికులను అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
పేలుడు ధాటికి భయపడిన కార్మికులు బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దం చుట్టుపక్కల గ్రామాల్లో వినిపించడంతో స్థానికులు పరిశ్రమ వద్దకు భారీగా చేరుకున్నారు. పరిశ్రమ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంత భారీ ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. రియాక్టర్ లో సాంకేతిక లోపం వల్లే పేలుడు జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న దానిపై విచారణ ప్రారంభమైంది.
Suicide : కారులో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న నవ వధువు