YSRTP Prasthanam : ముగిసిన షర్మిల YSRTP ప్రస్థానం
- By Sudheer Published Date - 12:52 PM, Thu - 4 January 24

షర్మిల స్థాపించిన YSRTP పార్టీ ప్రస్థానం ముగిసింది. నేడు రాహుల్ సమక్షంలో షర్మిల (Sharmila ) కాంగ్రెస్ కండువా కప్పుకొని..తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం (YSRTP Merge Congress) చేసింది. వైఎస్ మరణం తర్వాత…జగన్ మోహన్ రెడ్డి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని స్థాపించగా షర్మిల ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో పార్టీని భుజాలకెత్తుకొని రాష్టవ్యాప్తంగా పాదయాత్ర చేసి అన్నాను గెలిపించింది. 2020 వరకు ఆమె వైసీపీలో కొనసాగగా..ఆ తర్వాత అన్నతో విభేదాలు రావడంతో.. తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను తెలంగాణ బిడ్డనే అని.. రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ 2021 జులై 8న వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.
తెలంగాణ లో రాజన్న రాజ్యం తీసుకరావాలని వైస్ షర్మిల ఎన్నో కలలు కన్నది.. పార్టీ స్థాపించగానే కేసీఆర్ ఫై నిప్పులు చెరుగుతూ..తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలఫై పోరాటం చేస్తూ వచ్చింది. ధర్నాలు, నిరాహార దీక్షలు ఇలా ఎన్నో చేసి..వార్తల్లో నిలిచింది. కానీ ఇతర పార్టీల నేతలను ఆకట్టుకోలేకపోయింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరుగుతుండడం తో షర్మిలను పట్టించుకునే నాధుడు లేకుండాపోయాడు. అయినప్పటికీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని.. తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించింది. అయితే ఎన్నికలకు ముందు అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో తమ పార్టీ పోటీ నుంచి తప్పుకుటుంటుందని ప్రకటించారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన షర్మిల..చివరకు నేడు తన పార్టీ ని కాంగ్రెస్ లో కలిపేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్, ఖర్గేసహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల కాంగ్రెస్ లో తాను చేరడంపై స్పందించారు.
వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన తండ్రి వైఎస్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, అందులోనే ఆయన అసువులుబాశారని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. తాను వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్సార్ కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
Read Also : Jagan : కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్