Sanjeevaiah Park : కాంక్రీట్ జంగిల్ గా మారిన సంజీవయ్య పార్క్
హైదరాబాద్ లోని పెద్ద పార్కుల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న సంజీవయ్య పార్క్ ఒకటి. ఒకప్పుడు ప్రకృతి ప్రేమికులు, ప్రేమికులతో ఈ పార్కు సందడిగా ఉండేది.
- By Hashtag U Published Date - 12:20 PM, Wed - 24 November 21

హైదరాబాద్ లోని పెద్ద పార్కుల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న సంజీవయ్య పార్క్ ఒకటి. ఒకప్పుడు ప్రకృతి ప్రేమికులు, ప్రేమికులతో ఈ పార్కు సందడిగా ఉండేది. పార్కులో ప్రేమికుల మితిమీరిన చేష్టలు చూడలేక చాలామంది ఫిర్యాదు చేయడంతో రెండేళ్ళుగా దీన్ని పిల్లల పార్కుగా మార్చారు. 14 సంవత్సరాలలోపు పిల్లలు వారి పేరెంట్స్ తోగాని, సంరక్షకులతో గాని పార్కుకు రావచ్చు. నియమ నిబంధనలన్నీ బాగానే ఉన్నా రాను రాను పార్కులో పచ్చదనం పోయి కాంక్రీట్ జంగిల్ గా మారుతోందనే ఆరోపణలకు సమాధానం ఇచ్చేవారే లేరు. ఏటా హరిత హారం లక్ష్యాలు నెరవేర్చడం కోసం ఒక పద్దతంటూ లేకుండా ఎలా బడితే అలా నాటే మొక్కలతో పార్కు అంతా నిండిపోతోంది. అంతేగాని పర్యాటకులు, సాయంత్రం వేళ నగర ప్రజలు కాస్త సేద దీరేందుకు వస్తే వారికి కావాల్సిన ఆహ్లాదాన్ని పంచేలా లేదిప్పుడు. 15 సంవత్సరాల నుంచి ఉపగ్రహ చిత్రాలు చూస్తే సంజీవయ్య పార్కుకు పట్టిన దుస్థితి కళ్ళకు కడుతుంది.
పార్కును సందర్శించడానికి వచ్చే విజిటర్స్ కు లోపలున్న ఆకర్షణల పేరిట ఎంట్రన్స్ లో కనిపించే బోర్డు మీద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. సీతాకోక చిలుకల పార్క్, గులాబీల తోట, సువాసనలు వెదజల్లే మొక్కల తోట, బాంబూ గార్డెన్, పడవ పందాల క్లబ్, పిల్లల సైన్స్ పార్క్, అతిపెద్ద జాతీయ జెండా పార్క్, దామోదరం సంజీవయ్య స్మారకం, రాక్ గార్డెన్, ఫ్లోరల్ క్లాక్, కేఫ్టేరియా, అవుట్ డోర్ జిమ్ వంటి పేర్లన్నీ ఆ బోర్డు మీద కనిపిస్తాయి. వీటిలో చాలావరకు బోర్డు మీద మాత్రమే ఉన్నాయి. గులాబీ మొక్కల తోట చూడాలనుకునేవారికి అక్కడ చిన్న చిన్న మొక్కలు మాత్రమే కనిపిస్తాయి. దాన్ని తోట అనుకునే వీలే లేదు. ఇక బటర్ ఫ్లై పార్క్ సంగతి చూస్తే శాటిలైట్ మ్యాప్ లో సీతాకోక చిలుకను చూసినట్లే ఉంటుంది. అక్కడ రంగు రంగుల పూల మొక్కలు మాత్రమే ఉన్నాయి. అయితే సందర్శకులకు థ్రిల్ కలిగించే థీమ్ పార్క్ ఏప్రిల్ లేదా మే నెల నాటికి అందుబాటులోకి తేవాలని ఈ ఏడాది ఆరంభంలో నిర్ణయించారు. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఆ పనులకు ఆటంకం కలిగింది.
పార్క్ బయట నైట్ బజార్ కూడా తీసుకురావాలని భావించారు. 1300 మీటర్ల పొడవునా నైట్ బజార్ వస్తుంది. చెప్పడానికి, వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నా ముందు పార్కులో పచ్చదనాన్ని పెంచుతూ..బయటి బోర్డు మీద ఉన్న జాబితాలోని అంశాలన్నీ అమలులోకి తెస్తే సంజీవయ్య పార్కు పేరు నిలబడుతుందని సందర్శకులు భావిస్తున్నారు.
Related News

Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..