Revanth Reddy: మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు, టీకాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ ధన్యవాదాలు
ఈసారి పోలింగ్ నమోదు శాతం హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో అత్యధికంగా నమోదైంది.
- By Balu J Published Date - 02:39 PM, Fri - 1 December 23

Revanth Reddy: తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయి. ఈసారి పోలింగ్ నమోదు శాతం హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో అత్యధికంగా నమోదైంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.
‘‘తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది’’ అంటూ రియాక్ట్ అయ్యారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పూర్తయింది. ఓటింగ్ పూర్తికావడంతో ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం టర్నవుట్ యాప్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 70.53 శాతం పోలింగ్ నమోదైంది.