Revanth Reddy : సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌ని బంగాళఖాతంలో కలపాలంటూ ప్రజలకు పిలుపు
సీఎం కేసీఆర్‌ని ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి సచివాలయానికి వెళ్లేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని
- Author : Prasad
Date : 30-06-2023 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
సీఎం కేసీఆర్‌ని ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి సచివాలయానికి వెళ్లేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. జిల్లాల్లో పర్యటించి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిని ఒత్తిడి చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఖమ్మంలో జులై 2న జరిగే జనగర్జన సభకు సంబంధించి ఏర్పాట్లను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తీసుకురావడానికి టిఎస్‌ఆర్‌టిసి బస్సులు ఇవ్వడానికి నిరాకరించిందని.. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు తమ సొంత వాహనాలు, అందుబాటులో ఉన్న వాటిలో సభకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారందరినీ ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హమీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం సమావేశంలో ధరణి పోర్టల్‌ను రద్దు చేయడంతోపాటు రైతుబంధు మొత్తాన్ని రూ.10,000 నుంచి రూ.15,000కి పెంచడంతోపాటు కౌలు రైతులకు ప్రతి సంవత్సరం రూ.12,000 చెల్లించాలని ఆయన తెలిపారు. జులై 2న జరిగే సభకు ప్రజలు రాకుండా పోలీసులు విధించిన ఆంక్షలను పట్టించుకోవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పోలీసులు తమ వాహనాలను అనుమతించకుంటే నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకోవాలని ఆయన కోరారు.