Revanth Reddy Exclusive: ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉన్నా ఒక్కటే.. కూలగొట్టినా ఒక్కటే!
రేవంత్ రెడ్డి.. (Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నింపిన రథసారథి.
- By hashtagu Published Date - 11:53 PM, Mon - 13 February 23

రేవంత్ రెడ్డి.. (Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నింపిన రథసారథి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అటు నాయకుల్లో, ఇటు కార్యకర్తల్లో మనోధైర్యం నింపిన నేత. తనపై ఎన్ని విమర్శలొచ్చినా తగ్గెదేలే అంటూ దూసుకుపోతున్న నికార్స అయిన నాయకుడు. సీనియర్లతో విభేదాలు పక్కన పెడితే అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే లీడర్. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ప్రగతి భవన్ ను పెల్చేయాల్సిందే అని తేల్చి చెప్పిన టీపీసీసీ (TPCC) చీఫ్ రేవంత్ రెడ్డిని హ్యాష్ ట్యాగ్ యూ (Hashtag U) పలుకరించింది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు మీకోసం…
తెలంగాణలో బ్రహ్మండమైన పాలన సాగుతుందంటున్న కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలపై మీరేమంటారు?
అనాడు ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అదానీ, అంబానీల కోసం రైతులను శాశ్వాతంగా మార్చేందుకు నల్ల చట్టాలు తీసుకొచ్చారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా కూడా రైతులు కదంతొక్కడంతో మోడీ ప్రభుత్వం రైతులకు క్షమాపణలు చెప్పి నల్లచట్టాలను రద్దు చేసింది. అప్పటి పాదయాత్ర రైతులకు ఉపయోగపడితే, ఇవాల్టి పాదయాత్ర సమూలంగా తెలంగాణలో మార్పు రావడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నాం. ఇవాళ కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో 90 వేల మంది రైతులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భీమా ప్రవేశపెట్టాక 90 వేల మంది రైతులు చనిపోయారు. ఈ విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. అయినా అద్భుతమైన పాలన అందిస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉన్నాం కేసీఆర్, ఆయన పుత్రుడు డ్రామారావు (KTR) చెప్పడం సిగ్గుచేటు. తెలంగాణ ఉద్యమమే నియామకాల మీద ప్రతిపాదికన ఎక్కవ పోరాటాలు జరిగాయి. అందుకే విద్యార్థులు క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ వ్యాప్తంగా రెండు లక్షలపై ఉద్యోగాలు ఖాళీలున్నాయి. తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావోస్తున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం. ఫీజు రియింబర్స్ మెంట్ కూడా అందక పిల్లల భవిష్యత్తు గందరగోళంగా మారింది. ఆరోగ్య శ్రీ బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో ఏ ఒక్కరికి సరైన వైద్యం అందడం లేదు. ఇక రుణమాఫీ ప్రకటించినా నేటివరకు కార్యరూపం దాల్చలేదు. 23 లక్షల కోట్లు చేతికొచ్చినా రైతు రుణమాఫీ ఎందుకు ప్రకటించలేదు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసంచేస్తున్నప్పటికీ ప్రతి ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలవడానికి కారణం?
ఉప ఎన్నికలు ఓ ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే జరుగుతాయి. ఇవాళ రెండు ఆత్మహత్యల ద్వారా ఉప ఎన్నికలు జరిగాయి. ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy), మరొకటి ఈటల రాజేందర్ ఆత్మహత్యలు చేసుకోవడం ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల మ్యానిఫెస్టో, లీడర్ విశ్వసనీయత కారణంగా ఎన్నికలు జరగడం లేదు. మునుగోడు నియోజకవర్గంలో 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏవిధంగా బరితెగించేందుకు అర్థం చేసుకోవచ్చు. మునుగోడు ఎన్నికల సమయంలో మేం మద్యం పంపిణీ చేయకుండా కాంగ్రెస్ తీర్మానం చేసింది. కానీ ఎందుకు బీఆర్ఎస్, బీజేపీ తీర్మానం చేయలేదు.
తెలంగాణ కాంగ్రెస్ యూనిటీ ఉండదనీ, గెలిచినవాళ్లంతా ఇతర పార్టీల్లో చేరుతున్నారని ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది. ఈ ఇష్యూపై మీరు ఎలా స్పందిస్తారు?
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉండే ఉంటే కానీ ఇతర పార్టీల వైపు వెళ్లేవారు కాదు. గెలిచిన నాయకులను బెదిరించడమో, ప్రలోభపెట్టడమే వల్లనే పార్టీలు మారడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ (Congress Party) కచ్చితమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈమారు ఎవరు గెలిచినా నూటిని నూరుశాతం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటరు. అందుకే ప్రజలకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తున్నా. పన్నులు, టెండర్ల, ధరణితో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నరు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాల్సి ఉంది.
ప్రగతి భవన్ ను పెల్చేయాలని వాఖ్యనించారు? ఎందుకు?
తొలిదశ, మలిదశ లో కాంగ్రెస్ తమవంతు పోరాటం చేసింది.ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే తుది దశ పోరాటం ఉద్యమంలో భాగంగానే ప్రగతి భవన్ (Pragathi Bhavan) ను పెల్చేయాలి అని పిలుపునిచ్చారు. అప్పట్లో మెట్రోరైల్ బాంబులు పెట్టి పెల్చేస్తాం అని కేసీఆర్ ను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోని అన్ని వర్గాల సంఘాలు ఒకప్పుడు ముఖ్యమంత్రి చెప్పుకునేవాళ్లు. గత పాలకులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అవసరమైన మేరకు ప్రజల సమస్యలు పరిష్కరించేవాళ్లు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడం లేదు. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉన్నా ఒక్కటే.. కూలగొట్టినా ఒక్కటే అని నా అభిప్రాయం.
గిరిజనులకు పోడు భూములు పంచుతామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మీరే ఏమంటారు?
తెలంగాణలో చాలామంది పోడు భూముల సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంలో కాంగ్రెస్ హాయంలో పోడు భూముల పట్టాలు అందించాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం వాళ్ల భూములను లాక్కుంటోంది. అటవీ ఆఫీసర్లకు, గిరిజనులకు పంచాయితీ పెడుతుంది. కాంగ్రెస్ చేస్తున్న యాత్ర వల్లనే పోడు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని కేసీఆర్ కు స్పష్టంగా అర్థమైంది. అయితే ఆదివాసీలు తిరుగబడుతారనే కారణంతోనే హుటాహుటీనా అసెంబ్లీకి వచ్చి ప్రకటన చేసిండు. పోడు భూముల సమస్యలను పరిష్కరించేవరకు కేసీఆర్ వదిలే ప్రసక్తే లేదు.
కాంగ్రెస్ ముందస్తును ఎలా ఎదుర్కోబోతోంది?
కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాలా స్పష్టత ఉంది. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అవగాహన ఉంది. అవగాహన లేనివారికి కచ్చితంగా అవగాహన కల్పిస్తా. ముందస్తుకు మేం ఎప్పుడో రెడీగా ఉన్నాం.