Census Survey : కులగణన రీ సర్వే చేయాలి – కేటీఆర్
Census Survey : బీసీ జనాభాను కావాలని తగ్గించి చూపించారని ఆరోపించారు. సుమారు 22 లక్షల మంది బీసీలను లెక్కల్లో పేర్కొనలేదని మండిపడ్డారు
- By Sudheer Published Date - 05:44 PM, Sun - 9 February 25

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్(Telangana Bhavan)లో బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే(Census Survey)పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ జనాభాను కావాలని తగ్గించి చూపించారని ఆరోపించారు. సుమారు 22 లక్షల మంది బీసీలను లెక్కల్లో పేర్కొనలేదని మండిపడ్డారు. కులగణనలో భారీ పొరపాట్లు జరిగాయని, ఇది పూర్తిగా అశాస్త్రీయమని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే చిత్తు కాగితంతో సమానమని, అందుకే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ దీన్ని తగలబెట్టాడని ఆయన తెలిపారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే రీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.
CM Revanth Reddy : దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన టైం – సీఎం రేవంత్
సర్వే ప్రకటనలో పొరపాట్లు ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు. తప్పుడు లెక్కలు చూపించి బీసీల హక్కులను హరించడాన్ని బీఆర్ఎస్ సహించబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిజమైన గణాంకాలను వెల్లడించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కులగణనలో మాజీ సీఎం కేసీఆర్, తాను పాల్గొనలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం నిరాధారమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో బీసీలకు అనేక ప్రయోజనాలు కల్పించామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ బీసీల హక్కులను హరించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.
బీసీలకు న్యాయం జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు ఒకటిగా వచ్చి డిమాండ్ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాము రీ సర్వేకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కులగణన లెక్కల్లో స్పష్టత రావాలని, దాన్ని ఆధారంగా ప్రభుత్వ విధానాలు రూపొందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.