Konda Susmita : మా ఫ్యామిలీపై రెడ్డి వర్గం కుట్ర.. సురేఖ కూతురు ఆరోపణలు
Konda Susmita : తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తూ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత గురువారం రాత్రి సోషల్ మీడియాలో ఒక సంచలన వీడియో విడుదల చేశారు.
- By Sudheer Published Date - 11:20 AM, Thu - 16 October 25

తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తూ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత గురువారం రాత్రి సోషల్ మీడియాలో ఒక సంచలన వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె.. “రెడ్డి వర్గం మొత్తం కలిసి మా కుటుంబంపై కుట్ర పన్ని మాకు మానసికంగా ఒత్తిడి తెస్తున్నారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో ముఖ్యంగా కడియం శ్రీహరి, వరంగల్ ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావిస్తూ, వారందరూ కలిసి తన తల్లి సురేఖను ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. “మేము ప్రజల కోసం పనిచేస్తే ఎందుకింత కక్షగట్టారు? ఎవరికీ భయం లేకుండా మా కుటుంబాన్ని లక్ష్యంగా ఎందుకు చేసుకున్నారు?” అని సుస్మిత ప్రశ్నించారు.
Konda Vs Ponguleti : కొండా-పొంగులేటి వివాదంలోకి సీఎం రేవంత్ పేరు!
వీడియోలో సుస్మిత తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లోని మా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. మాకు భయపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరికీ భయపడమని చెబుతున్నాను. మా కుటుంబం మీద ఎంత కుట్ర చేసినా, న్యాయం మా వైపే ఉంటుంది” అని ధైర్యంగా అన్నారు. ఆమె వాడిన భాషలో కొన్ని పరుష పదజాలం కూడా ఉండటంతో, వీడియో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని, ఈ వీడియో ఆ తగాదాలకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదే సమయంలో, సుస్మిత తన అభిమానులకు, అనుచరులకు సందేశం పంపుతూ, “మా కుటుంబం ఎప్పటికీ వెనక్కి తగ్గదు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగం. మీరు ఆందోళన చెందవద్దు” అంటూ హామీ ఇచ్చారు. కొండా సురేఖ – పొంగులేటి మధుసూదన్‌రెడ్డి మధ్య సాగుతున్న టెండర్ వివాదం నేపథ్యంలో ఈ వీడియో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ఘటనతో రూలింగ్ కాంగ్రెస్‌లో అసంతృప్తి బహిరంగమవుతోంది. సుస్మిత ఆరోపణలపై పార్టీ అగ్రనేతలు స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది.