Mahabubnagar MLC Polls : మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ బైపోల్ ప్రారంభం.. ఓటు వేయనున్న సీఎం రేవంత్
Mahabubnagar MLC Polls : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
- Author : Pasha
Date : 28-03-2024 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
Mahabubnagar MLC Polls : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఇందులో 1439 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇద్దరు ఎంపీలు, 14 మంది శాసనసభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు కలిపి మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. 1439 మంది ఓటర్లలో 644 మంది పురుషులు, 795 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 245 మంది ఓటర్లు, అత్యల్పంగా కొడంగల్‌లో 56 మంది ఓటర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో, మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
14 నియోజకవర్గాల్లో 10 పోలింగ్ కేంద్రాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్‌లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బైపోల్(Mahabubnagar MLC Polls) బరిలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ నిలిచారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కేంద్రం లోపలికి ఒకేసారి ఎక్కువ మందిని అనుమతించకుండా నలుగురు ఓటర్లు చొప్పున మాత్రమే అనుమతిస్తున్నారు. బ్యాలెట్ విధానంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని చూపించిన తర్వాతే అధికారులు లోపలికి అనుమతి ఇస్తున్నారు.
Also Read :Kavitha Food Menu : తీహార్ జైల్లో కవిత.. మొదటి రోజు ఏం తిన్నారో తెలుసా ?
ఏప్రిల్ 2న బైపోల్ ఓట్ల లెక్కింపు
ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్య ఓటు, రెండో ప్రాధాన్య ఓటు, మూడో ప్రాధాన్య ఓటు ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లను తొలుత లెక్కిస్తారు. పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు సగం కంటే ఒక్క ఓటు అదనంగా వచ్చినా ఆ అభ్యర్థి మొదటి రౌండ్‌లో విజయం సాధిస్తారు. అందుకే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారంలో భాగంగా తొలి ప్రాధాన్య ఓటు మాత్రమే వేయాలని అభ్యర్థించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు. ఏప్రిల్ 2న ఈ బైపోల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడంతో ఈ బైపోల్ వచ్చింది.