Not a drop : ఏనీ టైం నో ‘వాటర్’.. దాహం తీర్చని వాటర్ ఏటీఎంలు!
కేవలం 2 రూపాయలకే స్వచ్చమైన తాగునీరును అందించడమే లక్ష్యంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. అయితే ప్రజల కోసం తీసుకొచ్చిన వినూత్న ప్రాజెక్ట్ 2017లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఆర్భాటంగా ప్రారంభించింది.
- By Balu J Published Date - 12:37 PM, Sat - 11 December 21

కేవలం 2 రూపాయలకే స్వచ్చమైన తాగునీరును అందించడమే లక్ష్యంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. అయితే ప్రజల కోసం తీసుకొచ్చిన వినూత్న ప్రాజెక్ట్ 2017లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఆర్భాటంగా ప్రారంభించింది. నగర ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా స్వచ్ఛమైన తాగునీరు తాగొచ్చని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే.. నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు 200-బేసి ఆటోమేటిక్ వాటర్ వెండింగ్ మెషీన్లు (AWVM) పనిచేయకుండా నిరుపయోగంగా మారాయి. ఫలితంగా ప్రయాణికులు, పర్యాటకులకు ఏమాత్రంగా ఉపయోగపడటం లేదు. పైగా రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమీర్‌పేటలోని హాస్టల్‌లో నివసించే రాజేష్ కుమార్ మాట్లాడుతూ, “మీకు దాహం వేస్తే, వాటర్ ఏటీఎం దగ్గర ఆగిపోకండి, ఎందుకంటే అది నీరు ఇవ్వదు’’ అని అంటున్నాడు. ముషీరాబాద్, ఇందిరాపార్క్, రాజ్‌భవన్ రోడ్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు, నాంపల్లి, కోటి, పుత్లిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లోని అనేక వాటర్ ఏటీఎంల్లో ఏ ఒక్కటి పనిచేయడం లేదు. విరిగిన కుళాయిలు, దెబ్బతిన్న పైపులు దర్శనమిస్తున్నాయి. ఇంతకుముందు GHMC మరో 300 ATM ఇన్‌స్టాల్ చేయాలని భావించింది, కానీ ఇప్పుడు ఈ ప్రతిపాదనలను విరమించుకుంది. ప్రజలు, నగరానికి వచ్చే విజిటర్స్ స్వచ్ఛమైన గ్లాసు నీటిని రూ. 1కి, లీటరు రూ. 2కి పొందేందుకు ఉద్దేశించబడింది. జోసాబ్ ఇంటర్నేషనల్ AB (స్టాక్‌హోమ్) నేచర్స్ స్ప్రింగ్ ఎకో ట్యాప్ ప్రైవేట్ లిమిటెడ్‌ల సహకారంతో GHMC నీటి ATMలను ఏర్పాటు చేసింది. ఇది వాటర్ బోర్డు ద్వారా సరఫరా చేయబడిన నీటిని శుద్ధి చేస్తుంది. అయితే నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతం గ్రే ఏరియాగా మారింది.
అయోమయంలో అధికారులు
నగర ప్రజల కోసం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వాటర్ ఏటీఎం వ్యవస్థ పూర్తిగా నిరుగారిపోయింది. ఇప్పటికీ పలుచోట్లా ఉత్సవ విగ్రహాలు మారి దర్శనమిస్తున్నాయి. నగరంలో వాటర్ ఏటీఎం ల్లో ఏ ఒక్కటి కూడా పనిచేయడం లేదని, వాటిని ఏం చేయాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు అంగీకరించారు.