Jubilee Hills Elections : జూబ్లీహిల్స్ పోరులో తెర పైకి కొత్త సమీకరణాలు
Jubilee Hills Elections : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్ని పార్టీలు సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకొని ప్రణాళికలు రచిస్తున్నాయి
- By Sudheer Published Date - 07:15 PM, Mon - 3 November 25
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్ని పార్టీలు సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకొని ప్రణాళికలు రచిస్తున్నాయి. మొత్తం 4.01 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు, కమ్మలు, రెడ్డీలు, ఎస్సీలు, లంబాడీలు, క్రైస్తవులు వంటి వర్గాల ఓట్లు సమానంగా విస్తరించి ఉండటంతో ఎవరి మద్దతు ఏ పార్టీకి దక్కుతుందనేది గెలుపు ఓటములను తేలుస్తోంది. గత ఎన్నికల్లో మతపరమైన, సామాజిక సమీకరణాలు ప్రభావం చూపిన నేపథ్యంలో, ఈసారి కూడా పార్టీలు వర్గాల వారీగా ఓట్లు బంధించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుతం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు కులాల ఆధారంగా తమ బేస్‌ను బలపరచేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీతను కమ్మ వర్గానికి చెందిన అభ్యర్థిగా నిలబెట్టగా, ఆ వర్గం ఓట్లను ఏకీకృతం చేయడానికి మంత్రి పువ్వాడ అజయ్ వంటి నేతలను రంగంలోకి దించింది. అదే సమయంలో కాంగ్రెస్ కమ్మ ఓటర్లను ఆకర్షించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అరికెపూడి గాంధీ వంటి నేతలను వినియోగిస్తోంది. కమ్మ సంఘాల ప్రతినిధులు కూడా సీఎం రేవంత్‌రెడ్డి తో భేటీ అవుతూ తమ మద్దతును ప్రకటించటం కాంగ్రెస్ కు బలం చేకూర్చింది. యాదవ్ వర్గ ఓట్లను కాపాడుకోవడానికి నవీన్ యాదవ్ చురుకుగా ప్రచారం చేస్తుండగా, ఆ ఓట్లను విభజించడానికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మైదానంలోకి దించింది.
ఇక బీజేపీ తరఫున లంకెల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి వర్గ ఓటర్లు గణనీయంగా ఉండటంతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా ప్రచారం బాధ్యతలు తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక తరహాలోనే బీఆర్‌ఎస్ అన్ని కులాల నేతలను రంగంలోకి దించి, ప్రతి సామాజిక వర్గం వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ వర్గాల మధ్య సఖ్యతా భావాన్ని పెంచే ప్రయత్నంలో ఉంది. ఈ అన్ని సమీకరణాల దృష్ట్యా జూబ్లీహిల్స్ పోరు మరింత ఉత్కంఠగా మారింది. చివరికి ఏ వర్గం ఏ పార్టీకి మద్దతు ఇస్తుందన్నదే ఈ ఎన్నికలో తుది ఫలితాన్ని నిర్ణయించనుంది.