AICC On Rajagopal Reddy: వేటు వేయాలా..? వద్దా..?
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే ఒప్పించి కాంగ్రెస్‌లోనే ఉండేలా చూస్తామని
- By Balu J Published Date - 12:01 PM, Thu - 28 July 22

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏమైనా సమస్యలుంటే ఒప్పించి కాంగ్రెస్‌లోనే ఉండేలా చూస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన విక్రమార్క.. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉన్నారని, సోనియా, రాహుల్ గాంధీలపై తనకు గౌరవం ఉందన్నారు. సుమారు మూడు గంటల పాటు ఎమ్మెల్యేతో చర్చించామని, ఆయనపై గౌరవం ఉందన్నారు. పార్టీపై తాను చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలకు వివరణ ఇచ్చారని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌కు రాజకీయ అవగాహన లేదని సీఎల్పీ నేత మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నట్లు సంజయ్ చేసిన ప్రకటన అబద్ధమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపైనే తమ దృష్టి ఉందని, బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై దృష్టి సారించి సమయాన్ని వృథా చేయకూడదని విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యే పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో ఎంపీగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేను కలవడానికి, శాంతింపజేయడానికి పార్టీ CLP చీఫ్‌ను కూడా పంపింది. మూడు గంటలకు పైగా సమావేశం జరిగినా రాజగోపాల్ రెడ్డిలో మార్పు రాలేదు.