Musi River : మూసీలో గోదావరి నీళ్లు పారిస్తాం – మంత్రి కోమటిరెడ్డి
Musi River : గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?
- By Sudheer Published Date - 04:58 PM, Tue - 1 October 24

మూసీ నది(Musi River)ని ప్రక్షాళన చేసి గోదావరి జలాలు తీసుకురావాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. మల్లన్నసాగర్ జలాశయం నుంచి మూసీకి నీటిని తరలిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, 56 కి.మీ మేర మూసీ ప్రక్షాళన చేపట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో మల్లన్నసాగర్ భూనిర్వాసితులను వేధించారని, పరిహారం నిధులు అడిగితే అక్రమ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. గతంలో మూసీ ప్రక్షాళనకు ఛైర్మన్‌ను నియమించి ఏం చేశారని, గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. గతంలో మూసీ అభివృద్ధికి జైకా నుంచి రూ.వెయ్యి కోట్లు అప్పు తెచ్చారని , ఏ ప్రభుత్వానికైనా మూసీ ప్రక్షాళన ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
తాము చేస్తుంటే ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ గురించి పార్లమెంటులో కూడా పలుమార్లు ప్రస్తావించానని, పలుమార్లు ప్రధాని దృష్టికి తీసుకువచ్చానని మంత్రి కోమటిరెడ్డి గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన కోసం 11 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారని, మూసీ మరణకారకంగా మారిందని ప్రొ.జయశంకర్ చెప్పారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని అని విమర్శించారు.
మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?. బీఆర్‌ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి అని సవాళ్లు విసిరారు.
Read Also : Palm Oil Farmers: పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల