KTR : కేటీఆర్ చెంప చెల్లుమనిపించాడు
మార్కుల గురించి నిలదీసిన కేటీఆర్ చెంపపై ఆ మాస్టారు ఒక్కటిచ్చారు. "చెంప చెల్లుమనేసరికి నాకు మతిపోయింది.. స్కూల్‌లో కొడతారని తెలుసు కానీ, కాలేజీల్లో కూడా కొడతారా?" అని ఆ క్షణం తాను ఆశ్చర్యపోయానని కేటీఆర్ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు
- Author : Sudheer
Date : 30-04-2026 - 11:45 IST
Published By : Hashtagu Telugu Desk
రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ, అనర్గళమైన ప్రసంగాలతో ఆకట్టుకునే కేటీఆర్ వెనుక ఒక సామాన్య విద్యార్థి కథ ఉంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ.. కేవలం తన ప్రాణ స్నేహితుడు కళ్యాణ్ కోసం తాను హైదరాబాద్‌ను వదిలి గుంటూరులోని ఒక కాలేజీలో చేరినట్లు తెలిపారు. స్నేహం కోసం పక్క రాష్ట్రం, కొత్త నగరం వెళ్లడం అప్పట్లో తనకు ఒక సాహసంగా అనిపించిందని, కానీ అక్కడ ఎదురైన అనుభవాలు తన జీవితంలో మర్చిపోలేని పాఠాలను నేర్పాయని ఆయన సరదాగా చెప్పుకొచ్చారు.
ఒత్తుల తంటా.. 4 మార్కుల షాక్!
గుంటూరులో చేరిన కొత్తలో కేటీఆర్‌కు తెలుగు భాషా విషయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఒకసారి జరిగిన పరీక్షలో ఆయన రాసిన సమాధానాలకు కేవలం 25 మార్కులకు గాను 4 మార్కులు మాత్రమే వచ్చాయి. దీనికి కారణం ఆయన సమాధానాల్లో తెలుగు ‘ఒత్తులు’ సరిగ్గా రాయకపోవడమే. చదువులో ఎప్పుడూ ముందుండే తనకు ఇన్ని తక్కువ మార్కులు రావడం ఏంటని ఆశ్చర్యపోయిన కేటీఆర్, నేరుగా వెళ్లి తన మాస్టారును ప్రశ్నించారు. అయితే, ఆ ప్రశ్న అడిగినందుకు ఆయనకు ఊహించని స్పందన లభించింది.
చెంప చెల్లుమనిపించిన మాస్టారు.. ఆశ్చర్యంలో కేటీఆర్
మార్కుల గురించి నిలదీసిన కేటీఆర్ చెంపపై ఆ మాస్టారు ఒక్కటిచ్చారు. “చెంప చెల్లుమనేసరికి నాకు మతిపోయింది.. స్కూల్‌లో కొడతారని తెలుసు కానీ, కాలేజీల్లో కూడా కొడతారా?” అని ఆ క్షణం తాను ఆశ్చర్యపోయానని కేటీఆర్ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఆ దెబ్బతో ఆయనకు క్రమశిక్షణ మరియు భాషా ప్రాముఖ్యతపై ఒక అవగాహన వచ్చిందని, ఆ చిన్న నాటి చేదు అనుభవం ఇప్పుడు తీపి జ్ఞాపకంగా మారిందని ఆయన వివరించారు. ఈ కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కేటీఆర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.