Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
‘‘సోదరి కవిత నాకు రాఖీ పండుగ నాడు రాఖీ కట్టలేకపోయినా.. ఆమెకు ఎప్పటికీ అండగా ఉంటా’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
- By Pasha Published Date - 01:26 PM, Mon - 19 August 24

KTR Emotional : రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘సోదరి కవిత నాకు రాఖీ పండుగ నాడు రాఖీ కట్టలేకపోయినా.. ఆమెకు ఎప్పటికీ అండగా ఉంటా’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. గత సంవత్సరం సోదరి కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోలను ఆ పోస్ట్‌లో కేటీఆర్ షేర్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. దీంతో ఈ ఏడాది కేటీఆర్‌కు కవిత(Kavitha) రాఖీ కట్టలేకపోయారు. ఈనేపథ్యంలో ఇవాళ కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తనతో సోదరికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
కవిత బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు (మంగళవారం) విచారణ జరపనుంది. అవినీతి, మనీలాండరింగ్ అభియోగాలతో కవితను ఈడీ, సీబీఐ అరెస్టు చేశాయి. గతంలో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ జులై 1న తిరస్కరణకు గురైంది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న కవిత అప్పీల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, వాటిపై స్పందన తెలియజేయాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీంతో కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక నిందితుడు మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చేముందు కూడా ఈడీ, సీబీఐల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. ఇప్పుడు కవిత విషయంలోనూ అదే విధంగా ఆ రెండు దర్యాప్తు సంస్థల స్పందనను దేశ సర్వోన్నత న్యాయస్థానం కోరింది. దీంతో ఈసారి కవితకు బెయిల్ వస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి.