Teenmar Mallanna : కాంగ్రెస్ ప్రభుత్వం పై తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు
Teenmar Mallanna : తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన కోటాను పట్టపగలే అగ్రవర్గాలకు అప్పజెప్పుతున్న విధానం పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
- By Latha Suma Published Date - 04:55 PM, Mon - 21 October 24

Congress Government : రాజ్ భవన్‌లో ఈరోజు బీసీ సంఘం ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో అన్ని బీసీ సంఘాల నాయకులు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. జీవో 29 వద్దని చెబుతున్నా అదే జీవో ప్రకారం.. ఇవాళ ప్రభుత్వం గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తోందని.. నా అంచనా ప్రకారం గ్రూప్ -1 పరీక్షలు ముందుకు వెళ్లే పరీక్షలేమి కావని అటు ఇటు ఊగి చివరకు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికే వచ్చి చేరుకునేలా కనిపిస్తోందని అన్నారు. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన కోటాను పట్టపగలే అగ్రవర్గాలకు అప్పజెప్పుతున్న విధానం పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
గతంలోనే ఈ సమస్యను గవర్నర్ కు వివరించినా ఇవాళ మరోసారి కలిసి గవర్నర్ కు వినతిపత్రం అందజేశామని చెప్పారు. పదే పదే పరీక్షలు వాయిదా పడటం వల్ల అభ్యర్థుల మనోధైర్యం దెబ్బతినేలా ఉందని అందువల్ల కోర్టు కేసుల పరిష్కారం తర్వాతే పరీక్షలు నిర్వహించే విషయాన్ని గవర్నర్ కు నివేదించామన్నారు. కేవలం 3 శాతం ఉన్న అగ్రవర్ణాల ప్రజల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ఇది బీసీల కంచంలో నుంచి కూడు లాక్కోవడమే అన్నారు. ఈ విషయంలో తాను ఇప్పటి వరకు సీఎంకు మూడు సార్లు, గవర్నర్ కు రెండు సార్లు వినతిపత్రం ఇచ్చానన్నారు.