CM Revanth: కేసీఆర్ పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది: సీఎం రేవంత్
- By Balu J Published Date - 04:32 PM, Thu - 21 March 24
CM Revanth: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మరోమారు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. నేను సీఎం గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే. ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు. ‘‘కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది. వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10లక్షలకు పెంపు, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నాం.
మల్కాజిగిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంఖుస్థాపన చేసునుకున్నాం. మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య తీరాలన్నా.. కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి’’ అని రేవంత్ అన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రమంతా తుఫాను వచ్చినట్లు గెలిచినా మల్కాజిగిరి పార్లమెంట్ లో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని అన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 4 స్థానాలు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది.
అందుకే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. అప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలి. హొలీ పండగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. మనకుబలమైన నాయకత్వం ఉంది.. సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది’’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.